భారత్ సమాచార్, దిల్లీ ;
తక్కువ ఖర్చుతో సిటీ బస్ సర్వీసలు, ఎక్కువ సౌలభ్యంతో మెట్రో ట్రైన్ లు, సొంత టూ వీలర్స్ అందుబాటులో ఉన్నప్పుడు అసలు బైక్ టాక్సీలు అవసరమా అని అనుకున్నాం. కానీ ఓలా, ఊబర్, రాపిడో వంటి యాప్స్ లో బైక్ రైడ్స్ అందుబాటులోకి వచ్చాక చాలా సందర్భాల్లో మనమే రైడ్స్ ని బుక్ చేసుకునే రోజుల్లోకి వచ్చేశాం. ఇప్పుడు అంతా ఆన్ లైన్ మయం కదా. క్షణాల్లో అన్ని సర్వీస్ లు అందుబాటులో ఉంటాయి. ఇక తర్వాత ఎప్పుడు కావాలంటే అప్పుడు బస్స్ సర్వీసులను కూడా బుక్ చేసుకునే రోజులు అతి త్వరలోనే మన ముందున్నాయి. తాజాగా ఊబర్ సంస్థ దేశ రాజధానితో పాటుగా మరికొన్ని ప్రముఖ మెట్రో నగరాల్లో బస్సు సర్వీసులను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది.
దేశ రాజధాని నగరం దిల్లీలో తొలుత ఈ సేవలను ప్రారంభించనుంది. దిల్లీ ప్రీమియం బస్ స్కీమ్ కింద ఇకపై బస్సులను ఊబర్ సంస్థ నడపనుంది. ఈ మేరకు దిల్లీ రవాణా మంత్రిత్వ శాఖ నుంచి తాజాగా లైసెన్స్ అందుకుంది. ఈ తరహా లైసెన్స్ జారీ చేసిన తొలి రవాణా శాఖ దిల్లీనే. దీన్ని అందుకున్న తొలి అగ్రిగేటర్‌గా ఉబర్ నిలిచింది.
ఏడాదిగా దిల్లీ-ఎన్‌సీఆర్‌తో పాటు, కోల్‌కతాలోనూ ప్రయోగాత్మకంగా ఈ సేవలు నడుపుతున్నామని ఉబర్ షటిల్ ఇండియా హెడ్ అమిత్ దేశ్‌పాండే చెప్పారు. దిల్లీలో బస్సులకు విపరీతమైన డిమాండ్ ఉన్నట్లు గమనించామన్నారు. ఇప్పుడు అధికారికంగా తమ సేవలను దిల్లీలో ప్రారంభించ బోతున్నామని తెలిపారు. బస్సు సర్వీసులకు వారం ముందు నుంచే ప్రయాణికులు బుక్ చేసుకోవచ్చని ఉబర్ తెలిపింది.
బస్సు రాబోయే సమయం, బస్సు లైవ్ లొకేషన్, బస్సు రూట్లను ఎప్పటికప్పుడు ఉబర్ యాప్‌లో తెలుసుకోవచ్చని పేర్కొంది. ఒక్కో సర్వీసులో 19-50మంది ప్రయాణించడడానికి వీలుంటుందని తెలిపింది. ఉబర్ టెక్నాలజీ సాయంతో స్థానిక ఆపరేటర్లు వీటిని నడుపుతారని ఊబర్ సంస్థ పేర్కొంది.