Homemain slidesఅందుబాటులోకి మరో 750 ఎంబీబీఎస్‌ సీట్లు

అందుబాటులోకి మరో 750 ఎంబీబీఎస్‌ సీట్లు

భారత్ సమాచార్, మదనపల్లి ;

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా మరో ఐదు ప్రభుత్వ వైద్య కళాశాలలు 2024–25 విద్యా సంవత్సరం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా వైద్య కళాశాల నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. పాడేరు, పులివెందుల, ఆదోని, మార్కాపురం, మదనపల్లెలో కొత్తగా వైద్య కళాశాలలను ప్రారంభించి ఒక్కో చోట 150 చొప్పున 750 ఎంబీబీఎస్‌ సీట్లు అదనంగా కేటాయించేలా వైద్య శాఖ గత ఏడాది నుంచే కసరత్తులు చేస్తోంది. ఈమేరకు జాతీయ వైద్య కమిషన్‌ (ఎన్‌ఎంసీ) త్వరలో ఐదు చోట్ల అతి త్వరలో ఇన్‌స్పెక్షన్‌ నిర్వహించే అవకాశం ఉన్నట్లు వైద్య శాఖ వర్గాలు ఇటీవల వెల్లడించాయి. తనిఖీలు పూర్తయిన తర్వాత ఆయా కళాశాలలకు మొదటి సంవత్సరం తరగతులు నిర్వహించటానికి అనుమతులు మంజూరు చేయబడతాయి.

ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గాన్ని జిల్లాగా చేయడంతో పాటు అన్ని జిల్లాల్లో సూపర్‌ స్పెషాలిటీ వైద్య సేవలను పేదలకు అందుబాటులోకి తెస్తూ 17 కొత్త మెడికల్‌ కాలేజీల ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. 2023–24లో నంద్యాల, మచిలీపట్నం, ఏలూరు, రాజమహేంద్రవరం, విజయనగరం వైద్య కళాశాలలను ఇప్పటికే ప్రారంభించారు. ఒక్కో చోట 150 చొప్పున మొత్తం 750 ఎంబీబీఎస్‌ సీట్లను అదనంగా అందుబాటులోకి తెచ్చారు. ఈ విద్యా సంవత్సరంలో అదనంగా మరో 750 సీట్లను అందుబాటులోనికి తెచ్చే విధంగా అధికారులు కసరత్తులు ప్రారంభించారు. పాడేరు, పులివెందుల, ఆదోని, మార్కాపురం, మదనపల్లె ఇలా ఐదు చోట్ల ఎన్‌ఎంసీ నిబంధనలకు అనుగుణంగా వైద్య కళాశాలలు, బోధనాస్పత్రులను అభివృద్ధి చేస్తున్నారు. వైద్య కళాశాలకు 222, బోధనాస్పత్రికి 484 చొప్పున 3,530 పోస్టులను మంజూరు చేశారు. అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, పాథాలజీ, ఫార్మకాలజీ, ఫోరెన్సిక్‌ మెడిసిన్, ఎస్పీఎం, జనరల్‌ మెడిసిన్, గైనిక్, పీడియాట్రిక్స్‌ విభాగాల్లో ప్రొఫెసర్, అసోసియేట్, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లతో పాటు నర్సింగ్, మెడికల్, నాన్‌ మెడికల్, అడ్మినిస్ట్రేషన్‌ పోస్టులను మంజూరు చేసి భర్తీ కూడా చేపట్టారు.

ఈ కళాశాలలన్నీ మారుమూల గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో ఉన్నందున పోస్టులన్నీ భర్తీ చేసేలా వైద్య శాఖ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు.

మరికొన్ని వార్తా విశేషాలు…

ఏపీలో రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదు

RELATED ARTICLES

Most Popular

Recent Comments