Homemain slidesవర్షం కురిసింది... వజ్రం దొరికింది

వర్షం కురిసింది… వజ్రం దొరికింది

భారత్ సమాచార్, కర్నూలు ;

రాయలు వారు ఏలిన నేల రాయలసీమలో ఒకప్పుడు వజ్రాలు అన్నీ కుప్పలుగా పోసీ అమ్మేవారట. ఆ తర్వాత కాలక్రమేణా రాయలసీమ కరువు ప్రాంతంగా మారిపోయిన విషయం అందరికి తెలిసిందే. సీమ లోని ఉమ్మడి కర్నూలు, అనంతపురం జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో చాలా కాలం నుంచి వర్షం వస్తే వజ్రాల కోసం అన్వేషిస్తున్నారు. ఇప్పటికే ఇక్కడ చాలా మందికి వజ్రాలు కూడా దొరికాయి. తాజాగా కర్నూలు జిల్లా మద్దెకర మండలం హంప గ్రామంలో ఓ రైతు పొలం పనుల్లో ఉండగా వజ్రం దొరికింది.

ఈ విషయం తెలిసి వ్యాపారులు ఆయన ఇంటి ముందు క్యూ కట్టారు. ఆ వజ్రాన్ని సొంతం చేసుకోవడానికి వ్యాపారులు పోటీ పడడంతో వేలం నిర్వహించారు. ఇందులో పెరవల్లికి చెందిన ఓ వ్యాపారస్థుడు రూ.5 లక్షల నగదు, 2 తులాల బంగారం ఇచ్చి ఆ రైతు నుంచి వజ్రాన్ని సొంతం చేసుకున్నాడు. అయితే, బహిరంగ మార్కెట్ లో ఆ వజ్రం విలువ రూ.10 లక్షలకు మించి ఉంటుందని సమాచారం.

ఏటా వర్షాకాలం తొలకరి సమయంలో కర్నూలు, అనంతపురం జిల్లాలో వజ్రాల కోసం పొలాల్లో రైతులు, కూలీలు, ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వారు వెతుకుతుంటారు. దీనికోసం ప్రత్యేకంగా భూమిని లీజుకు తీసుకుని, కూలీలను పెట్టి వెతికించే వాళ్లు కూడా ఉన్నారు. ఒక్క విలువైన వజ్రం దొరికితే దశ మారిపోయే అవకాశం కావడంతో రైతులు కూడా తమ పొలాల్లో వజ్రాల కోసం వెతుకుతుంటారు.

కాగా, భూమిలో దొరికే విలువైన వజ్రాలు, గుప్త నిధులు వంటివి చట్టప్రకారం ప్రభుత్వ ఖజానాకు చేర్చాల్సి ఉంటుంది. ప్రైవేటు వ్యక్తులకు చెందిన భూముల్లో దొరికినా సరే అది ప్రభుత్వ ఆస్తేనని చట్టాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా రైతుకు దొరికిన వజ్రాన్ని ప్రభుత్వ ఖజానాకు జమ చేయాల్సిన స్థానిక అధికారులు.. తమకు పట్టనట్టు ఉండడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

మరికొన్ని వార్తా విశేషాలు…

అనాథ పిల్లలకు ఉచిత విద్య

 

RELATED ARTICLES

Most Popular

Recent Comments