భారత్ సమాచార్, అమరావతి ;
ఆంధ్రప్రదేశ్ 2024 అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సమయంలో కొన్ని కేంద్రాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్ని విషయం అందరికి తెలిసిందే. పోలింగ్ తర్వాత కూడా ఎవ్వరూ ఊహించని విధంగా మాచర్ల, పల్నాడు, తాడిపత్రి, చంద్రగిరి వంటి ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు, అల్లర్లు చోటుచేసుకున్నాయి. దీన్ని ఎన్నికల కమిషన్ చాలా సీరియస్ గా తీసుకుంది. దీనిపై వివరణ కోరుతూ కొన్ని చోట్ల ఎన్నికల అధికారులపై బదిలీ వేటు కూడా వేసింది. ప్రస్తుతం జూన్ 4వ తేదీ ఏపీలో కౌంటింగ్ రోజున ఎటువంటి అల్లర్లు జరగకుండా అలర్ట్ అవుతోంది. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్‌పై ఫుల్ పోకస్ పెట్టింది కేంద్ర ఎన్నికల సంఘం. విజయోత్సవాలు, ఊరేగింపులు, కవ్వింపులు లేకుండా స్పెషల్ యాక్షన్ చేపట్టింది.
కౌంటింగ్ రోజు, ఆ తర్వాత 15 రోజుల పాటు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఎన్నికల సంఘం సూచన చేసింది. రాష్ట్రానికి అదనంగా మరో 25 కంపెనీల కేంద్ర బలగాలను నియమించింది. భద్రత కోసం ఇప్పటికే 20 కంపెనీల కేంద్ర బలగాలు రాష్ట్రానికి చేరుకున్నాయి. ఇవాళో రేపు మరో 5 కంపెనీల కేంద్ర బలగాలు రాష్ట్రానికి రానున్నాయి. హింసాత్మక ఘటనలు జరగకుండా అన్ని జిల్లాలకు స్పెషల్ పోలీసు ఆఫీసర్లను నియమించారు. అత్యంత సమస్యాత్మక ప్రాంతంగా గుర్తించిన పల్నాడులో అత్యధికంగా 8 మంది పోలీస్ అధికారులను నియమించారు. కృష్ణా జిల్లాకు చిత్తూరు జిల్లా విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎస్పీగా పని చేస్తున్న లావణ్య లక్ష్మిని, విజయవాడ పోలీస్ కమిషనరేట్‌కు సిఐడి డిఎస్పి సోమన్నను నియమించారు.
అనంతపురం జిల్లాలోనూ అల్లర్లు జరిగే అవకాశం ఉండటంతో కౌంటింగ్ కేంద్రాల దగ్గర భారీ భద్రత ఏర్పాటు చేశారు. జిల్లాకు ముగ్గురు సెష్పల్ అధికారులను నియమించారు. వారికి సమస్యాత్మక ప్రాంతాల్లో బాధ్యతలు అప్పగించనున్నారు. మరోవైపు జేఎన్టీయూ కౌంటింగ్ కేంద్రాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక చెక్ పోస్టులు ఏర్పాటు చేయడమే కాకుండా ప్రత్యేక నిఘా పెట్టారు. సీసీ కెమెరాలను కమాండ్ కంట్రోల్ రూమ్‌తో అనుసంధానం చేసి నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
మరోవైపు ఈసీ కౌంటింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూంల దగ్గర మూడంచెల భద్రత ఏర్పాటు చేసింది. స్ట్రాంగ్ రూంలు, కౌంటింగ్ ఏర్పాట్ల పర్యవేక్షణను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముకేశ్‌కుమార్ మీనా. విశాఖపట్నం, శ్రీకాకుళంలో పర్యటించారు. జిల్లా కలెక్టర్, పోలీసు కమిషనర్ తో కలిసి ఏయూ పరిధిలోని స్ట్రాంగ్ రూమ్‌ల భద్రతను స్వయంగా పరిశీలించారు. విశాఖపట్టణం పార్లమెంటుతో పాటు, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన స్ట్రాంగ్ రూమ్‌లను తనిఖీ చేశారు. అక్కడ పరిస్థితులను గమనించారు. తలుపులకు వేసిన తాళాలను, వాటికున్న సీళ్లను సున్నితంగా పరిశీలించారు. అన్ని చోట్లా సీసీ కెమెరాలు ఉన్నాయా? అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నారా? అనేక అంశాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
అనధికార వ్యక్తులను స్ట్రాంగ్ రూమ్‌లు ఉన్న ప్రాంతంలోకి ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించరాదని చెప్పారు. ఎలక్షన్ కమిషన్ నిబంధనల ప్రకారం అన్ని రకాల జాగ్రత్తలు వహించాలన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ఎన్నికల అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు.