భారత్ సమాచార్, అమరావతి ;
ఆంధ్రప్రదేశ్ 2024 అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికల సందర్భంగా కొన్ని ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలింగ్ అనంతరం కూడా తాడిపత్రి, మాచర్ల, చంద్రగిరి వంటి ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. దీంతో జూన్ 4వ తేదీ ఎన్నికల ఫలితాల రోజున ఎటువంటి అల్లర్లు, హింసాత్మక ఘటనలు చోటుచేసుకోకుండా ఎన్నికల కమిషన్ ఏపీ పై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఫలితాల రోజున కేంద్ర బలగాలతో బందోభస్తు ఏర్పాటు చేసింది. అధికారులతో ఏపీ సీఈవో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు.
తాజాగా జూన్ 3, 4, 5 తేదీల్లో ఆంధ్రప్రదేశ్ లో మద్యం అమ్మకాలపై నిషేధం విధిస్తున్నట్టు డీజీపీ హరీశ్ గుప్తా వెల్లడించారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద కేంద్ర బలగాలతో కట్టుదిట్టమైన భాద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. ఆ మూడు రోజుల్లో మద్యం అమ్మకాలు నిషేధించాలని అన్ని జిల్లాల అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్టు వెల్లడించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని హోటల్స్, లాడ్జీలలో తనిఖీలు చేసి అనుమానితులను అదుపులోకి అధికారులకు సూచించారు. సోషల్ మీడియాలో వచ్చే వార్తలనూ ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అప్రమత్తంగా ఉండాలని చెప్పారు.