భారత్ సమాచార్, అమరావతి ;
ఆంధ్రప్రదేశ్ లోని శాసనమండలిలో ఎమ్మెల్యేల ద్వారా జరిగే రెండు ఎమ్మెల్సీ స్థానాల ఉప ఎన్నికలకు ఎన్నికల కమిషన్ (ఈసీ) తాజాగా నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఇటీవల సి.రామచంద్రయ్య పై అనర్హత వేటు పడటం వల్ల, మరో ఎమ్మెల్సీ ఇక్బాల్ రాజీనామాతో రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయ్యాయి. దీంతో ఎన్నికల కమిషన్ ఈ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహిస్తోంది. అర్హులైన అభ్యర్థులు జులై 2 వ తేదీ వరకు నామినేషన్లు దాఖలు చేసుకోవచ్చు. జులై 3 వ తేదీన దాఖలైన నామినేషన్లను ఎన్నికల అధికారులు పరిశీలిస్తారు. జులై 5 వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుంది.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ లో ప్రస్తుతం టీడీపీ-జనసేన-బీజేపీ కూటమికి అత్యధికంగా 164 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. ఈ సంఖ్యా బలం కారణంగా రెండు ఎమ్మెల్సీ స్థానాలు కూడా కూటమికే దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వైసీపీ పార్టీ పోటీ చేయాలని భావిస్తే జులై 12వ తేదీన ఎన్నికలను నిర్వహిస్తారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది.పోలింగ్ పూర్తి అయిన తర్వాత ఎన్నికల అధికారులు వెంటనే ఓట్ల లెక్కింపును చేపడతారు. అదే రోజు ఎన్నికల ఫలితాలను ప్రకటిస్తారు.