భారత్ సమాచార్, ఆధ్యాత్మికం ;
తిరుచానూరులో వెలసిన పద్మావతి అమ్మవారి గురించి జనపదాలలో ప్రచారంలో వున్న కథ…
సప్తగిరులలో అంగరంగవైభవంగా జరిగిన పద్మావతి శ్రీనివాసుల కళ్యాణం దర్శించడానికి సకల దేవతలు, మహర్షులు, అనేకమంది వచ్చారు. శేషాచలం నుండి శ్రీశైలం దాకా కళ్యాణ విందు కోసం ఘనమైన ఏర్పాట్లు జరిపారు. అంతటి వైభవోపేత వివాహంలో ఏ కొరతలు లేకపోయినా కలహభోజనుడైన నారదుడు వూరికే వుండలేదు. బ్రహ్మాండంగా తన పుత్రుని వివాహం జరిపిన అత్త
వకుళాదేవి ,కోడలు పద్మావతిల మధ్య చిచ్చు పెట్టడానికి నారదమహర్షి సంకల్పించాడు. మెల్లగా వకుళ మాత వద్దకు వెళ్ళి కళ్యాణం అలంకారాలలో అందమైన కనకాంబరాలు , విందుభోజనాలలో రుచిని పెంచే కరివేపాకును ఉపయోగించకపోవడం లోటుగా కనిపించిందని అందరూ అనుకుంటున్నారనే వార్తను తనే వకుళాదేవికి చేరవేశాడు.
కొద్ది కాలం తర్వాత ఒకనాడు ఆ లోటును వకుళాదేవి ఎత్తిచూపగా పద్మావతి , శ్రీనివాసుల మధ్య మనస్తాపాలు పెరిగి అలక చెందిన పద్మావతీదేవి శ్రీనివాసుని విడనాడి తిరుచానూరు వెళ్ళి ప్రత్యేక సన్నిధి ఏర్పరుచుకున్నదని ఆ జానపద గాధ తెలియజేస్తోంది. అందువలననే ఈనాడు తిరుమలతిరుపతిలో కరివేపాకు గాని , కనకాంబరాలు గాని ఏవిధంగాను వుపయోగించరని అంటారు. నారాయణపురంలో పద్మావతిదేవి అవతరించినందున అక్కడ పద్మావతిదేవి కి ప్రత్యేక ఆలయం అమరినట్లు మరికొందరంటారు.
ఏది ఏమైనా ముందుగా తిరుచానూరులో పద్మావతీ దేవిని దర్శించకుండా తిరుమల వెళ్ళరాదని శాస్త్రం. ప్రథమంగా అమ్మవారిని దర్శించిన తర్వాతే శ్రీనివాసుని దర్శిస్తేనే
పుణ్యప్రదమని భక్తుల ప్రగాఢ విశ్వాసం.