భారత్ సమాచార్, జాబ్స్ అడ్డా ;
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్టీసీ)లో ఖాళీగా ఉన్న 3,035 పోస్టుల భర్తీకి సీఎం రేవంత్ కుమార్ రెడ్డి ప్రభుత్వం తాజాగా అనుమతులు ఇచ్చింది. ఆర్టీసీ ఉన్నతాధికారులు ప్రతిపాదనలు పంపిన అన్ని పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ జారీ చేసింది. మొత్తం పోస్టుల్లో 2000 డ్రైవర్ పోస్టులు, 743 శ్రామిక్ పోస్టులు, 114 డిప్యూటీ సూపరింటెండెంట్ (మెకానిక్) పోస్టులు, 84 డిప్యూటీ సూపరింటెండెంట్ (ట్రాఫిక్) పోస్టులు, 25 డిపో మేనేజర్/అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ పోస్టులు, 23 అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్) పోస్టులు, 15 అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీర్ పోస్టులు, 11 సెక్షన్ ఆఫీసర్ (సివిల్) పోస్టులు, 7 మెడికల్ ఆఫీసర్ (జనరల్) పోస్టులు, 7 మెడికల్ ఆఫీసర్ (స్పెషాలిస్ట్) కొలువులు ఉన్నాయి.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు టీజీఎస్‌ఆర్టీసీలో ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదని, ప్రజా రవాణా వ్యవస్థకు పెద్ద పీట వేస్తూ తమ ప్రభుత్వం ఉద్యోగాలను భర్తీ చేస్తోందని రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.
మహాలక్ష్మి పథకం అమలుతో పెరిగిన రద్దీకి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో కొత్త బస్సులను సంస్థ కొనుగోలు చేస్తోందని ఆయన తెలిపారు. ఈ కొత్త బస్సులకు అనుగుణంగా నియమకాలు చేపడుతున్నట్లు తెలిపారు. 3035 పోస్టులను వీలైనంత త్వరగా భర్తీ చేస్తామని నిరుద్యోగులకు హామి ఇచ్చారు.