భారత్ సమాచార్, ఆధ్యాత్మికం ;
హిరణ్యకశిపుడు తపస్సుకి వెళ్లినప్పుడు నారదుని ఆశ్రమములో లీలవతికి కుమారుడు కలిగాడు. ప్రహ్లాదుడు అని పేరు పెట్టారు. ఇతరులు సంతోషిస్తే సంతోషించే వాడు ప్రహ్లాదుడు. తనకి ఉన్నది ఒకరికి పెట్టి వారు సంతోషిస్తే ప్రహ్లాదుడు సంతోషిస్తాడు. ఒకడు ఏడిస్తే చూచిసంతోషించి తానే అనుభవించి సంతోషిస్తాడు హిరణ్యకశిపుడు. లోకములో ఒక ధర్మము ఉన్నది. మంచి కొడుకు పుట్టాలి అంటే పుణ్యము చేసిన వాడి కడుపున పుడతాడా? పాపము చేసిన వాడి కడుపున పుడతాడా? అటువంటి వాడి కడుపున పుట్టడానికి ప్రహ్లాదుడు చేసిన పాపము ఏమిటి?? అటువంటి కొడుకు పుట్టడానికి హిరణ్యకశిపుడు చేసుకున్న పుణ్యము ఏమిటి? అన్న ప్రశ్న వస్తుంది కదా?
భాగవతములోనే దీనికి జవాబు చెప్పారు. పుట్టుకతో నారదుని ఆశ్రయము లభించి అంత గొప్ప భక్తి తత్పరుడు కావడానికి కారణము ఎక్కడ ఉన్నది అంటే ప్రహ్లాదుని గత జన్మలలో సత్సంగము ఉన్నది. ఏది ఉన్న లేకపోయినా సత్పురుషులతో కలసి ఉండి వారితో తిరిగి వారిని సేవించాడు. మనము ఎంత ధర్మము ఆచరించాము అన్నది పక్కన పెడితే సత్పురుషులతో కలసి ఉంటే చాలు ఈశ్వర అనుగ్రహము కలుగుతుంది. ఆయనతో మనము ఉన్నామన్నది ముఖ్యము కాదు. ఆయన మనను గుర్తుపట్టి పేరు పెట్టి పిలిచి పక్కన కూర్చోపెట్టుకోగలడా? ఏ కారణమునకైనా అలా ఉంచుకోగలిగితే వాడు ఉత్తర జన్మలలో మహాభక్తుడైపోతాడు. సత్సంగమే ప్రహ్లాదుడు అంతటి భక్తుడిగా పుట్టడానికి కారణం అని పెద్దల మాట.