భారత్ సమాచార్, జాతీయం ;
పెళ్లి పేరుతో ఒక మాయలాడి 50 మంది యువకులను మోసం చేసి పెళ్లి చేసుకున్న ఘటన తాజాగా తమిళనాడులో వెలుగుచూసింది. డబ్బు, నగలే లక్ష్యంగా సంధ్య అనే యువతి నిత్య పెళ్లి కూతురి అవతారం ఎత్తింది. ఇందులో పోలీసులే షాక్ తిన్న విషయం ఏంటంటే…కి‘లేడి’ సంధ్య వలల్లో ఒక డీఎస్పీ, ఇద్దరు పోలీసు అధికారులతో సహా 50 మంది పెళ్లి పేరుతో మోసపోయారు.
తమిళనాడు – తిరుపూర్‌కు చెందిన ఓ యువకుడికి 35 సంవత్సరాలు వచ్చినా పెళ్లి కాకపోవడంతో డేట్ ద తమిళ్ వే అనే వెబ్సైట్‌లో చూసి సంధ్య అనే మహిళను పెళ్లి చేసుకున్నాడు. పెళ్ళైన 3 నెలల తర్వాత ఆమె ప్రవర్తనలో మార్పుతో అనుమానం వచ్చి తన ఆధార్ కార్డు చెక్ చేయగా అందులో భర్త పేరు వేరే ఉంది.. దీనిపై ఆ యువకుడు సంధ్యని ప్రశ్నించగా, ఆమె దీని గురించి మాట్లాడితే చంపేస్తానని బెదిరించింది. దీంతో భయపడ్డ ఆ యువకుడు స్థానిక పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు సంధ్యను అదుపులోకి తీసుకొని విచారించారు. సంధ్య కూపీ లాగటం ప్రారంభించిన పోలీసులు విస్తుపోయే నిజాలను తెలుసుకున్నారు. అప్పటికే సంధ్య ఒక డీఎస్పీ, ఒక పోలీసు ఇన్‌స్పెక్టర్, మదురైలో మరో పోలీసు అధికారి, కరూర్‌లో ఒక ఫైనాన్స్ అధికారితో సహా 50 మందికి పైగా పెళ్లి చేసుకుందని తెలిసింది.