భారత్ సమాచార్, జాబ్స్ అడ్డా ;
పదో తరగతి, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ విద్యార్హతలతో భారత నౌకాదళంలో 741 ఉద్యోగాలకు ప్రకటన వెలువడింది. పోటీ పరీక్షతో వీటిని భర్తీ చేయనున్నారు. ఎంపికైన వారికి ఆకర్షణీయ వేతనాలు లభిస్తాయి. ఇవన్నీ నేవీలో సివిల్ పోస్టులే. అందువల్ల మహిళలు, దివ్యాంగులూ కూడా పోటీ పరీక్షకు హాజరు కావచ్చు.
ఇండియన్ నేవీ సివిలియన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఐఎన్‌సెట్)తో పోస్టులన్నీ భర్తీ చేస్తారు. గ్రూప్ బీ, గ్రూప్ సీ విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. వీటికి ఎంపికైనవారు చార్జ్‌మెన్, సైంటిఫిక్ అసిస్టెంట్, డ్రాఫ్ట్స్‌మెన్, ఫైర్‌మెన్, ట్రేడ్స్‌మెన్.. మొదలైన హోదాతో విధులు నిర్వర్తిస్తారు. రాత పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సాధారణ వైద్య పరీక్షలు నిర్వహించి, ఉద్యోగంలోకి తీసుకుంటారు. ఫైర్‌మెన్, ఫైర్ ఇంజిన్ డ్రైవర్ పోస్టులకు అదనంగా దేహదార్ఢ్య పరీక్షలు ఉంటాయి. దేశంలో ఉన్న నేవీ కేంద్రాల్లో వీరు సేవలు అందించాల్సి ఉంటుంది. ఆసక్తి ఉన్నవారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
పరీక్ష ఇలా
గ్రూప్ బీ, గ్రూప్ సీ రెండు రకాల పోస్టులకూ విడిగా పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష విధానం, సిలబస్ ఒకటే. అయితే ప్రశ్నల స్థాయిలో తేడా ఉంటుంది. గ్రూప్ సీ ప్రశ్నపత్రం పదో తరగతి స్థాయిలో, గ్రూప్ బీ పోటీ పరీక్ష డిగ్రీ స్థాయిలో ఉంటుంది. పరీక్షను వంద మార్కులకు ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు. మొత్తం వంద ప్రశ్నలు. ఇందులో జనరల్ ఇంటెలిజెన్స్ 25, జనరల్ అవేర్‌నెస్ 25, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 25, ఇంగ్లిష్ లాంగ్వేజ్ 25 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు ఉంటాయి. నెగెటివ్ మార్కులు లేవు. ప్రశ్నపత్రం ఇంగ్లిష్, హిందీ మాధ్యమాల్లో మాత్రమే ఉంటుంది. పరీక్ష వ్యవధి 90 నిమిషాలు. పరీక్షలో విజయవంతమైతే, వైద్య పరీక్షలు నిర్వహించి, ఉద్యోగంలోకి తీసుకుంటారు.
పోస్టులు.. ఖాళీలు
గ్రూప్ బీలో.. ఛార్జ్‌మెన్ (వర్క్‌షాప్/ఫ్యాక్టరీ/ మెకానిక్)
ఖాళీలు: 29
అర్హత: బీఎస్సీ మ్యాథ్స్/ఫిజిక్స్/కెమిస్ట్రీ వీటిలో ఏదైనా సబ్జెక్టు చదివుండాలి లేదా కెమికల్/ ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్/ మెకానికల్/ కంప్యూటర్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా పూర్తిచేయాలి. మెకానిక్ విభాగానికి మాత్రం మెకానికల్/ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్/ప్రొడక్షన్ ఇంజినీరింగ్‌లో డిప్లొమాతోపాటు సంబంధిత విభాగంలో రెండేళ్ల అనుభవం అవసరం.
వయసు: 25 ఏళ్లకు మించరాదు. మెకానిక్ విభాగానికి 30 ఏళ్ల వరకు అవకాశం.
గ్రూప్ సీలో..
సైంటిఫిక్ అసిస్టెంట్
ఖాళీలు: 4, అర్హత: బీఎస్సీ ఫిజిక్స్/కెమిస్ట్రీ/ఎలక్ట్రానిక్స్/ఓషనోగ్రఫీతోపాటు రెండేళ్ల పని అనుభవం.
వయసు: 30 ఏళ్లలోపు ఉండాలి.
డ్రాఫ్ట్స్‌మెన్
ఖాళీలు: 2,
అర్హత: పదో తరగతి తర్వాత డ్రాప్ట్‌మెన్‌షిప్‌లో రెండేళ్ల ఐటీఐ.
వయసు: 25 ఏళ్లకు మించరాదు.
ఫైర్‌మెన్
ఖాళీలు: 444. ఈస్టర్న్ నేవల్ కమాండ్‌లో 99, వెస్టర్న్ నేవల్ కమాండ్ 237, సదరన్ నేవల్ కమాండ్ 60, అండమాన్ అండ్ నికోబార్ కమాండ్‌లో 48 ఉన్నాయి.
అర్హత: ఇంటర్మీడియట్‌తోపాటు ఫైర్ ఫైటింగ్‌లో ఎలిమెంటరీ/బేసిక్ కోర్సు పూర్తిచేయాలి. అలాగే నిర్దేశిత శారీరక ప్రమాణాలు తప్పనిసరి.
వయసు: 27 ఏళ్లలోపు ఉండాలి.
ఫైర్ ఇంజిన్ డ్రైవర్
ఖాళీలు: 58. ఇస్టర్న్ 31, వెస్టర్న్ 11, అండమాన్ అండ్ నికోబార్ 16 ఉన్నాయి.
అర్హత: ఇంటర్మీడియట్‌తోపాటు హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. నిర్దేశిత శారీరక ప్రమాణాలు తప్పనిసరి.
వయసు: 27 ఏళ్లలోపు ఉండాలి.
ట్రేడ్స్‌మెన్ మేట్
ఖాళీలు: 161. వెస్టర్న్ కమాండ్‌లో 135, ఈస్టర్న్ 15, సదరన్ 11 ఉన్నాయి.
అర్హత: పదో తరగతితోపాటు నిర్దేశిత ట్రేడుల్లో ఐటీఐ పూర్తిచేయాలి.
వయసు: 25 ఏళ్లలోపు ఉండాలి.
ఇవే కాకుండా పెస్ట్ కంట్రోల్ వర్కర్ 18, కుక్ 9, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (మినిస్టీరియల్) 16 పోస్టులు ఉన్నాయి. వీటికి పదో తరగతి సరిపోతుంది. వయసు 25 ఏళ్లు మించరాదు.
అన్ని ఉద్యోగాలకూ.. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు; ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు కేటగిరీ ప్రకారం 10-15 ఏళ్లు గరిష్ఠ వయసులో సడలింపులు ఇచ్చారు.
గ్రూప్ బీ పోస్టులకు ఎంపికైనవారు లెవెల్-6 వేతనం అందుకోవచ్చు. రూ.35,400 మూలవేతనం, అలవెన్సులు ఉంటాయి. అన్నీ కలిపి సుమారు రూ.60,000 మొదటి నెల నుంచే అందుకోవచ్చు. వీరు ఇంజినీర్లు, అధికారులకు సహాయకులుగా ఉంటారు. సాంకేతిక సేవల్లో భాగమవుతారు. గ్రూప్ సీలో.. డ్రాఫ్ట్స్‌మెన్ పోస్టులకు లెవెల్-4 వేతనం చెల్లిస్తారు. వీరు 25,500 మూలవేతనంతో సుమారు రూ.45,000 జీతం అందుకోవచ్చు. ఫైర్‌మెన్‌కు లెవెల్-2 వేతనాలు దక్కుతాయి. వీరు రూ.19,900 మూలవేతనంతో రూ.35,000కు పైగా జీతం మొదటి నెల నుంచే పొందవచ్చు. ఫైర్ ఇంజిన్ డ్రైవర్లకు లెవెల్-3 వేతనాలు చెల్లిస్తారు. వీరికి రూ.21,700 మూలవేతనం, అలవెన్సులు ఉంటాయి. మొదటి నెల నుంచే సుమారు రూ.40,000 పొందవచ్చు. ట్రేడ్స్‌మెన్ మేట్, మిగిలిన ఉద్యోగాలకు లెవెల్-1 రూ.18,000 మూలవేతనం లభిస్తుంది. డీఏ, హెచ్‌ఆర్‌ఏ.. అన్నీ కలిపి రూ.30 వేలు ప్రారంభ వేతనం తీసుకోవచ్చు. ట్రేడ్స్‌మెన్లు సబ్‌మెరైన్లు, షిప్పుల ఉత్పత్తి/నిర్వహణ విధుల్లో పాల్గొంటారు. మల్టీ టాస్కింగ్ స్టాఫ్‌కు ఎంపికైనవారు.. వివరాలు నమోదు, ఫైళ్లను తీసుకెళ్లడం, క్లరికల్ విధులు నిర్వర్తిస్తారు. ఆన్‌లైన్ దరఖాస్తులు ఆగస్టు 2వ తేదీ వరకు స్వీకరిస్తారు. ఫీజు: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలకు ఎటువంటి రుసుము లేదు. మిగిలిన వారు దరఖాస్తుకు రూ.295 చెల్లించాలి. పరీక్ష తేదీ: తర్వాత ప్రకటిస్తారు. మరిన్ని వివరాలకు అధికారిక వెబ్‌సైట్ https://incet.cbt-exam.in/incetcycle2/login/user ను సంప్రదించాలని అధికారులు సూచించారు.