భారత్ సమాచార్, ఆధ్మాత్మికం ;
అది 1907… అరుణాచలంపై ఓ యువ మౌనసాధువు ఉంటున్నాడు. వెంకటరామన్ అన్న పేరు తప్ప ఇతర వివరాలేవీ ఆయన నుంచి తెలియరాలేదు.కానీ, ఆ ముఖంలో ఏదో తేజస్సు. అందుకే అందరూ ఆయనను బ్రాహ్మణస్వామి అని పిలుస్తూ ఉండేవారు. ఆ రోజు అందరిలాగే పండితుడైన విరాగి కావ్యకంఠ గణపతిముని కూడా ఆ బ్రాహ్మణస్వామిని దర్శించుకోవడానికి వచ్చారు. అది కార్తిక మాసం, అష్టమి తిథి. అరుణాచలంలోని నైరుతి లింగం సమీపంలో గణపతిముని తపస్సులో ఉన్నారు. ఎవరో పిలిచినట్టు అనిపించింది. వెంటనే కొండపైకి చేరారు. అప్పటివరకు ఆయన ప్రశ్నకు ఎవరూ సమాధానం చెప్పడం లేదు. వివేకానందుడిలాగే వ్యాకులతతో ఎంతోమంది పండితులను, సన్యాసులను కలిశారు. కానీ, ఎవ్వరూ ఆయన సందేహాన్ని తీర్చలేదు. అసలు ‘తపస్సు’ అంటే ఏమిటి? ఇది గణపతిముని ప్రశ్న. కొన్నాళ్లుగా అరుణగిరిపై బ్రాహ్మణస్వామి దర్శనం కోసం గణపతిముని వస్తున్నా, తన మనసును బ్రాహ్మణస్వామి ముందు పరిచేందుకు సందేహిస్తూ ఉన్నారు. కానీ, ఎవరూ లేని సమయంలో విరూపాక్ష గుహ వద్ద, ఆ రోజు బ్రాహ్మణస్వామి ఒక్కడే బయట కూర్చొని ఉన్నారు. అప్పుడు ఆయనతో ‘నేను ఎన్నో శాస్త్రాలు చదివాను. ఎందరో పండితులను కలిశాను. వేదాంత గ్రంథాలనూ పరిశీలించాను. నిరంతరం నా ఇష్టదైవం నామాన్ని జపిస్తున్నాను. కానీ ‘తపస్సు’ అంటే ఏమిటో నిర్దిష్టంగా అర్థం కావటం లేదు. మిమ్మల్ని సంపూర్ణ శరణాగతితో అర్థిస్తున్నాను. నా సంశయాన్ని నివృత్తి చేయండి’ అని అడిగారు.
గణపతిముని సందేహం సావకాశంగా విన్న బ్రాహ్మణస్వామి ‘నేను అనే భావన తలెత్తినప్పుడు, మనసు ఆ భావనలో లయించడమే తపస్సు. అలాగే ఓ వ్యక్తి ఇష్టమంత్రాన్ని జపిస్తున్నప్పుడు మనసు ఆ మంత్రశబ్దంలో లయించడమే తపస్సు’ అని విస్పష్టం చేశారు. ఆ సమాధానం గణపతిముని సర్వసంశయాలనూ పటాపంచలు చేసింది. ఆయనలోని అజ్ఞానపు ముసుగును తొలగించి వేసింది. బ్రాహ్మణస్వామి సమాగమంతో ఆయన ఆధ్యాత్మిక జీవితానికే పరిపూర్ణత లభించినట్లయింది. పారమార్థిక సాధనలపై ఓ స్పష్టత వచ్చింది. ఆ ఆనంద పరవశంతోనే వెంకటరామన్ను తొలిసారిగా ‘మహర్షి’ అని సంబోధించారు. అలా అప్పటి నుంచి వెంకటరామన్.. ‘రమణ మహర్షి’గా ప్రసిద్ధుడయ్యారు. కావ్యకంఠ గణపతిముని 1878లో జన్మించారు. ఆయన పుట్టే సమయంలో వారి తండ్రి అయ్యల సోమయాజుల నరసింహశాస్త్రి కాశీలో వినాయకుడి సన్నిధిలో జపం చేస్తున్నారట. కాశీ నుంచి తిరిగివచ్చాక కుమారుడికి గణపతి అని పేరుపెట్టారు. బాల్యం నుంచే ఆయనలో ఆధ్యాత్మిక శోభ ప్రతిఫలించింది. ఆ జిజ్ఞాసతోనే పదేండ్లకే సమస్త గ్రంథాలు, జ్యోతిషం, పంచాగం ఆపోశన పట్టారు. రామాయణ, భారత, భాగవతాలు చదువుతున్నప్పుడు ఆయనకు రెండు కోరికలు కలిగాయి. ఒకటి వాల్మీకి, వ్యాస మహర్షిలా గొప్ప కవి అవ్వాలని, రెండోది విశ్వామిత్ర తదితర రుషులు, ప్రహ్లాదుడు, ధ్రువుడు లాంటి భక్తుల్లా తాను కూడా తపస్సు చేయాలనుకునే వారు. 1900 సంవత్సరంలో కాశీలో ప్రఖ్యాతులైన పండితుల సభలో గణపతి తన కవిత్వ, పాండిత్య ప్రకర్షతో అందరినీ అబ్బురపరిచారు. ఇరవై రెండేళ్ల వయసులో ‘కావ్యకంఠ’ బిరుదును పొందారు. అలా గణపతి కాస్తా ‘కావ్యకంఠ గణపతి’ అయ్యారు. శివపంచాక్షరి మంత్రాన్ని దీక్షగా స్వీకరించారు. దాదాపు పన్నెండుసార్లు భారతదేశంలో వివిధ పుణ్యక్షేత్రాలు పర్యటించి, తపోదీక్షను ఆచరించారు. శివ పంచాక్షరి మంత్రాన్ని కోటిసార్లు జపించారు. కోటిసార్లు రచించారు. కానీ, ఆయనలో ఏదో అసంతృప్తి. ఆధ్యాత్మికంగా తాను ఇంకా పరిపూర్ణతను సాధించలేదన్న అశాంతి. ఆ తపనతో తేజోలింగమైన శివుడిని దర్శించుకోవటానికి అరుణాచలం వచ్చారు. 1907లో అక్కడ జపం చేయటానికి వచ్చి బ్రాహ్మణస్వామికి ఆకర్షితులయ్యారు. అరుణగిరిపై ఉన్న అచంచలమైన మౌనాన్ని ‘రమణ మహర్షి’గా లోకానికి తెలియపరచింది కావ్యకంఠ గణపతిమునే.