భారత్ సమాచార్, అక్షర ప్రపంచం: తుమ్మముల్లు, సర్కారు ముల్లు, నల్ల తుమ్మముల్లు, ఎర్ర తుమ్మముల్లు అంతా.. ఏడుస్తూ ఊరి చివర బావి దగ్గర ఉన్న చోటకి నడుస్తున్నారు. ఒంటరైన ఎడమ చెప్పు ఏడుస్తూ.. కూర్చుంది. అక్కడే ఉన్న యానాదులు బసవయ్య బావిలో నీళ్లు తోడి చెప్పు మీద పోస్తున్నాడు. ఆ పక్కనే ఉన్న మంగలి రాంబ్రహ్మ చేతిలో ఉన్న చెక్కుముఖీ రాయికి కత్తి నూరుతుంటాడు. ఎడమ చెప్పుకి ఉన్న గాయాలకి నీళ్లు తగిలి నొప్పి చేస్తుంది. దాని మనసులో ఒక్కటే బాధ.. ఆ మాయదారి కుడి చెప్పు సచ్చిపోకపోతే ఈ రోజు అది ఆలా ఒంటరిగా ఉండేది కాదని, ఎక్కడెక్కడో తిరుగుతుండేవాళ్లమని. తన మనసులో మాటలు తెలుసుకున్న అక్కడ ముళ్ళన్ని పెద్దగా ఏడుస్తున్నాయి తప్ప ఏమి చెయ్యలేకపోతున్నాయి. అక్కడ నుంచి ఊరి చివర శ్మశానానికి నడుస్తున్నారు. రోడ్డు మీద పడిపోయిన పువ్వుల్ని, పురుగుల్ని, తప్పించుకొని నడుస్తున్న ఎడమ చెప్పు.. కళ్ళు కనిపించకుండా నడుస్తున్న తుమ్మముళ్లు, సర్కారుముళ్లుకి బలైపోతున్న పువ్వులు, పురుగుల చావుల కేకలు అక్కడ ఉన్న చెప్పుకి తెలుసు కానీ, భర్తపోయిన బాధలో అది మౌనంగా ఏడుస్తుంది. ఎదురుగా ఉన్న పెద్ద మంటలు చూసి చిన్న ఓదార్పు దొరికింది. అక్కడ ఉన్న అందరు కలిసి ఆ ఎడమ చెప్పును ఆ మంటల్లోకి విసిరేశారు. నవ్వుతూ, అక్కడ ఉన్న ముళ్లని వెనక్కి వెళుతున్నాయి. ఇంతలో ఎదురుగా వస్తున్న రేగిముళ్లు.
“భోజనాలు సిద్ధగా ఉన్నాయి అందరు రండి తిందాం” అంటూ చెప్పిన వెంటనే చాలా కాలమైన మంచి విందుభోజనాలకోసం ఎదురు చూసే ముళ్లకి ఆకలి బాగా పెరిగింది. ముందు రేగి ముళ్ళు పరుగులు తీస్తుంది, వాటి వెనుక పెద్ద ముళ్లు ఊరుకులు పెడుతున్నాయి. కుడి చెప్పు, ఎడమ చెప్పు( భార్య, భర్తలు/మాట,మనసు ). ముళ్ళు(బంధువులు, స్నేహితులు, ఊరివాళ్ళు మనుషులు). చావు బోజనంలో ఉండే రుచి, మరో భోజనంలో దొరకదు కడుపునిండా ఏడ్చి, కడుపు నిండా తిందాం.
చావు ఒక వరం, బ్రతుకు ఒక దౌర్భాగ్యం.