భారత్ సమాచార్, అమరావతి ;
అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ కూటమి రాజకీయ పార్టీలు అధికారంలోకి రావటానికి సూపర్ సిక్స్ గ్యారంటీలతో పాటుగా చాలా హామీలను ప్రకటించాయి. చాలా చోట్ల నియోజకవర్గ మ్యానిఫెస్టోలను కూడా ప్రకటించాయి. అటువంటి హామీలలో ముఖ్యమైనది ఏపీ జిల్లాల పునర్విభజన. గత ప్రభుత్వ హయాంలో జరిగిన జిల్లాల పునర్విభజన పై చాలా ప్రాంతాల్లో నిరసనలు వ్యక్తమయ్యాయి. వాటిని దృష్టిలో పెట్టుకొని అన్ని ప్రాంతాల వారి సెంటిమెంట్ కు అనుగుణంగా అధికారంలోకి రాగానే జిల్లాల పునర్విభజన చేపడతామని ఎన్నికల హామిని ప్రకటించారు కూటమి నాయకులు. తాజాగా అందుకు తగ్గట్టుగా కూటమి ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. మొత్తంగా 30 జిల్లాలగా పునర్విభజన చేయాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ఇందు కోసం డ్రాఫ్ట్ రెడీ అయినట్లుగా అధికార వర్గాలు పేర్కొన్నాయి. తాజాగా పలాస, నాగావళి, నూజివీడు, తెనాలి, అమరావతి కేంద్రంగా అమరరామ , మార్కాపురం, మదనపల్లి, హిందూపురం,ఆదోని గా కొత్త జిల్లాలను ప్రతిపాదించినట్లుగా డ్రాఫ్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాలు ఏర్పడినప్పటికి ఇంకా ఉమ్మడి జిల్లాల కేంద్రంగానే చాలా చోట్ల పరిపాలన సాగుతోంది. దీనికి గల ప్రధాన కారణం చాలా జిల్లా కేంద్రాల్లో సరైన మౌలిక సదుపాయాలు లేకపోవటమే. ఇటువంటి సమస్యలు మళ్లీ తలెత్తకుండా తగు జాగ్రత్తలతో కొత్త జిల్లాల రూపకల్పన జరుగుతున్నట్టు తెలుస్తోంది.