Homebreaking updates newsమిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా కలామ్

మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా కలామ్

భారత్ సమాచార్, జాతీయం ;

అంతరిక్ష శాస్త్రవేత్తగా,రాష్ట్రపతిగా భారతదేశానికి విశేష సేవలు అందజేసిన ఏపీజే అబ్దుల్ కలాం 1969లో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థలో (ఇస్రో) చేరారు. ఇస్రో మొట్టమొదటి స్వదేశీ ఉపగ్రహ ప్రయోగ వాహనం (SLV-III) తయారీలో పనిచేసారు. 1980 జూలైలో ఈ వాహనం రోహిణి ఉపగ్రహాన్ని భూమి దగ్గర కక్ష్యలో విజయవంతంగా చేర్చింది. SLV-III పరీక్ష విజయం తరువాత తనను కలవాల్సిందిగా ఇందిరాగాంధీ సతీశ్ ధావన్ ను పిలిచినప్పుడు, ఆయనతో పాటు వెళ్ళిన వారిలో అబ్దుల్ కలామ్ కూడా ఒకరు. అయితే మొదట ఈ ఆహ్వానం వచ్చినప్పుడు కలామ్ భయపడ్డారు. ‘నాకు బూట్లు లేవు, కేవలం చెప్పులు మాత్రమే ఉన్నాయి. ఎలా రావాలి..?’ అని సతీశ్ ధావన్ ను అడగగా.. ఆయన ‘మీరు ఇప్పటికే విజయాన్ని ధరించి ఉన్నారు., కాబట్టి ఎటువంటి సందేహాలు పెట్టుకోకుండా వచ్చేయండి’ అని అన్నారు.ఇస్రోలో పనిచేయడం తన జీవితంలో అతిపెద్ద విజయాల్లో ఒకటిగా పేర్కొన్నారు.

అవుల్ పకీర్ జైనులబ్దీన్ అబ్దుల్ కలామ్ తమిళనాడు రాష్ట్రంలోని రామేశ్వరంలో 1931, అక్టోబరు 15 న జన్మించారు. తండ్రి జైనులబ్దీన్, పడవ యజమాని. తల్లి ఆషియమ్మ గృహిణి. పేద కుటుంబం కావటంతో కుటుంబ అవసరాల కోసం కలామ్ చిన్న వయసులోనే పని చేయడం ప్రారంభించారు. పాఠశాల విద్య పూర్తి చేసిన తర్వాత, తన తండ్రికి ఆర్థికంగా చేదోడువాదోడుగా ఉండటానికి వార్తా పత్రికలు పంపిణీ చేసేవారు. పాఠశాలలో సగటు మార్కులు వచ్చినప్పటికీ నేర్చుకోవటానికి తపన పడేవారు. ఎక్కువ సమయం కష్టపడేవారు. రామనాథపురం స్క్వార్ట్జ్ మెట్రిక్యులేషన్ స్కూల్ లో తన పాఠశాల విద్య పూర్తి చేశాక, కలామ్ తిరుచిరాపల్లి లోని సెయింట్ జోసెఫ్స్ కళాశాలలో చేరి, 1954 లో భౌతికశాస్త్రంలో పట్టా పొందారు. అప్పట్లో ఈ కళాశాల మద్రాస్ విశ్వవిద్యాలయం అనుబంధ సంస్థగా ఉండేది. ఈ కోర్సుపై అతనికి కోర్సు పూర్తి అయ్యేవరకు మక్కువ కలగలేదు. నాలుగు సంవత్సరాలు ఈ కోర్సు చదివినందుకు తర్వాత చింతించారు. 1955లో మద్రాసులో ఏరోస్పేస్ ఇంజనీరింగులో చేరారు. కలామ్ సీనియర్ తరగతి ప్రాజెక్ట్ పనిచేస్తుండగా, పురోగతి లేకపోవడంతో డీన్ అసంతృప్తి చెంది ప్రాజెక్ట్ తదుపరి మూడు రోజుల్లో పూర్తి చేయకపోతే తన ఉపకారవేతనం రద్దుచేస్తాను అని బెదిరించారు. ఇచ్చిన గడువులో కష్టపడి పని పూర్తిచేసి డీన్ యొక్క మెప్పు పొందారు.

భారతదేశం అనేక క్షిపణులను విజయవంతంగా ప్రయోగించడంలో కలాం విశేష కృషి చేశారు. అందుకే ఆయనను మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. కలామ్ రాజకీయంగా భారత దేశం అంతర్జాతీయ సంబంధాలలో మరింత దృఢమైన నిర్ణయాలు తీసుకుని నిర్ణయాత్మక పాత్ర పోషించాలని కోరుకున్నారు. తాను సుదీర్ఘ కాలం కృషి చేసి అభివృద్ధి చేసిన అణ్వాయుధ కార్యక్రమం, కాబోయే ప్రపంచ ప్రబల శక్తిగా భారతదేశ స్థానాన్ని సుస్థిరం చేసే సాధనాల్లో ఒకటిగా ఆయన భావించారు. అతను భారత దేశపు యువతను వెన్ను తట్టి ప్రోత్సహించే ఉద్దేశంతో పాఠకుల్ని ఉత్తేజితుల్ని చేసే తన ఆత్మ కథ ‘‘వింగ్స్ ఆఫ్ ఫైర్’’ లాంటి పుస్తకాలు అనేకం రాశారు.ఆయనకు పిల్లలంటే చాలా ఇష్టం. 2015 జులై 27న ఒక విద్యాలయంలో స్పీచ్ ఇస్తూ ఆయన తుదిశ్వాస విడిచారు.

మరికొన్ని ప్రత్యేక కథనాలు...

గ్యాస్ కనెక్షన్ ఉంటే.. ఇన్సూరెన్స్ ఉన్నట్లే

RELATED ARTICLES

Most Popular

Recent Comments