భారత్ సమాచార్, హైదరాబాద్ ;
గత ప్రభుత్వ హయాంలో హైదరాబాద్ లో నిర్వహించిన ఈ-రేస్ లో అవినీతి జరిగిందంటూ వస్తున్న ఆరోపణలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ నేడు స్పందించారు. వాస్తవానికి రాజధానిలో ఎఫ్ 1 రేసు నిర్వహించటానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో ప్రయత్నం చేసిందన్నారు. కానీ నిర్వాహకులు ఇండియాకు వచ్చే ఇంట్రెస్ట్ లేదని చెప్పారన్నారు. భవిష్యత్ తరాలకు సంబంధించి ఎలక్ట్రిక్ వెహికిల్స్‌ను ప్రోత్సహించే పరిస్థితి ఇప్పుడు వచ్చిందన్న విషయం అందరికి తెలుసన్నారు. అందుకే ఫార్ములా రేసింగ్‌లో కూడా ఎలక్ట్రిక్ వెహికిల్స్‌తో చేసే రేసింగ్ ను ఫార్ములా ఈ-రేస్ ను హైదరాబాద్ లో నిర్వహించామని తెలిపారు. ఎఫ్ 1 రేసు రాని కారణంగా మేము ఫార్ములా ఈ-రేస్ తెచ్చామన్నారు. ఈ-రేస్ అనేది ప్రపంచంలోని అత్యంత గొప్ప నగరాల్లో జరుగుతుందన్నారు. ఈ నగరాల చోట హైదరాబాద్‌ను చేర్చాలని మేము ఈ-రేస్‌ను ఇక్కడికి తెచ్చామని చెప్పారు. హెచ్ఎండీఏకు తెలియకుండా మేము డబ్బులు ఇచ్చామని అంటున్నారు. కానీ హెచ్ఎండీఏకు పూర్తిగా ఈ విషయం తెలుసన్నారు. ఈ-రేస్‌ను ప్రభుత్వం తరఫున కార్యక్రమంగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంచేందుకు రూ. 55 కోట్లు ఖర్చు చేశామన్నారు.
ఇందులో అరవింద్ కుమార్ తప్పు ఏం లేదన్నారు. నేను ఈ మొత్తానికి బాధ్యత తీసుకుంటానని తెలిపారు. పురపాలక శాఖలో జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, పురపాలక శాఖలో ఇంటర్నల్‌గా డబ్బు అడ్జస్ట్మెంట్ చేసుకునే అవకాశం ఉందన్నారు. హెచ్ఎండీఏ ఇండిపెండెంట్ బోర్డు. దానికి ఛైర్మన్ సీఎం, వైస్ ఛైర్మన్ పురపాలక శాఖ మంత్రి అని చెప్పారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బ తినకుండా రూ.55 కోట్లు కట్టమని అరవింద్ కుమార్ కి నేనే చెప్పానని కేటీఆర్ వెల్లడించారు. దీనికి కేబినెట్ అప్రూవల్ అవసరం లేదన్నారు. ఈ-రేస్ కారణంగా 49 దేశాల్లో హైదరాబాద్ పేరు తెలిసేలా చేశాం. ఎన్నో పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నం చేశామన్నారు. తన మీద కోపంతో అందులో నాకేదో వచ్చిందనుకొని ఏమీ తెలుసుకోకుండా దాన్ని రద్దు చేశారని ఆరోపించారు. హైదరాబాద్ ఈ-రేస్‌ను రద్దు చేయటంతో జాగ్వార్, నిస్సాన్ లాంటి సంస్థలు అసంతృప్తి వ్యక్తం చేశాయని తెలిపారు. రేవంత్ రెడ్డి దిక్కుమాలిన నిర్ణయంతో ప్రపంచం ముందు హైదరాబాద్ ఇజ్జత్ పోయిందన్నారు. మనకు రూ. 700 కోట్లు లాస్ వచ్చిందన్నారు. కొందరు రాస్తున్నారు కేటీఆర్ చుట్టు ఉచ్చు అని రాస్తున్నారు. దీనిలో ఉచ్చు, బొచ్చు అనేది ఏముందని ఘూటుగా వ్యాఖ్యానించారు. నిజానికి హైదరాబాద్‌లో ఈ-రేస్ రాకుండా మన నగరం ఇమేజ్ దెబ్బ తీసినందుకు సీఎం పైనే కేసు పెట్టాలన్నారు. ఏసీబీ ఫుల్‌ఫామ్ రేవంత్ రెడ్డికి తెలుసా? అవినీతి జరిగితే ఏసీబీని వాడాలి. కానీ ఇక్కడ అవినీతి ఏముంది? నాకు వచ్చింది ఏముందని వ్యాఖ్యానించారు.