భారత్ సమాచార్.నెట్, తిరుమల: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు టీటీడీ కీలక విజ్ఞప్తి చేసింది. మార్చి నెలలో ఐదు రోజుల పాటు తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది. మార్చి నెలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఐదు రోజుల పాటు సహస్రదీపాలంకార సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం వంటి ఆర్జిత సేవలను రద్దు చేసినట్లు టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది. మరోవైపు తెప్పోత్సవాల సందర్భంగా శ్రీవారి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలు తరలివస్తారని టీటీడీ అంచాన వేస్తోంది. ఈ క్రమంలోనే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసింది టీటీడీ.
శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు:
మార్చి 9 నుంచి 13వ తేదీ వరకు తిరుమల శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు జరగనున్నాయి. తెప్పోత్సవాల్లో భాగంగా.. రాత్రి 7 నుంచి 8 గంటల వరకు పుష్కరిణిలో స్వామి, అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. మార్చి 9న తెప్పోత్సవాల్లో తొలిరోజు శ్రీ సీత లక్ష్మణ ఆంజనేయ సమేతంగా శ్రీరామచంద్రమూర్తిగా తెప్పలపై పుష్కరిణిలో మూడు చుట్లు తిరిగి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. అలాగే మార్చి 10వ తేదీ రెండోవ రోజు రుక్మిణీ సమేతంగా శ్రీకృష్ణస్వామి తెప్పలపై మూడు సార్లు విహరించి భక్తులకు అభయం ఇవ్వనున్నారు. ఇక మార్చి 11న శ్రీభూ సమేతంగా మలయప్పస్వామిగా మూడుసార్లు పుష్కరిణిలో విహరించి భక్తులను అనుగ్రహిస్తారు. అదేవిధంగా మార్చి 12న శ్రీమలయప్పస్వామిగా భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఇక చివరి రోజు శ్రీవారు ఏడుసార్లు తెప్పపై పుష్కరిణిలో విహరించి భక్తులను కటాక్షిస్తారు.
ఆర్జిత సేవలు రద్దు:
తెప్పోత్సవాల సందర్భంగా శ్రీవారికి నిర్వహించే పలు సేవలను టీటీడీ రద్దు చేసింది. మార్చి 9, 10 తేదీల్లో సహస్రదీపాలకార సేవను టీటీడీ రద్దు చేసింది. అలాగే మార్చి 11, 12, 13 తేదీల్లో ఆర్జిత బ్రహ్మత్సవం, సహస్రదీపాలంకార సేవలను కూడా రద్దు చేసింది.
ఇదిలా ఉంటే తిరుమలలో నిత్యం భక్తుల రద్ది కొనసాగుతోంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం టీటీడీ అన్నప్రసాదం అందిస్తున్న సంగతి తెలిసిందే. శ్రీవారి భక్తులకు అందించే అన్నప్రసాదం మెనూలో అదనంగా మరో కొత్త పదార్థం చేర్చింది టీటీడీ. నాణ్యమై దినుసులతో భక్తులకు రుచికరమైన అన్నప్రసాదాలను టీటీడీ అందిస్తోంది. తిరుమల వచ్చే భక్తుల కోసం ఇక నుంచి ప్రతిరోజు 35 వేల శనగపప్పు గారెలను వడ్డించనున్నట్లు టీటీడీ వెల్లడించింది. ఇటీవల తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో భక్తులకు శనగప్పు గారెలు వడ్డింపు కార్యక్రమాన్ని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ప్రారంభించిన సంగతి తెలిసిందే.