భారత్ సమాచార్.నెట్, న్యూ ఢిల్లీ: అంతర్జాతీయ మహిళా దినోత్సవం (International Womens Day) సందర్భంగా నారీశక్తికి వందనం అంటూ దేశంలోని మహిళలకు ప్రధాని మోదీ (PM Modi) శుభాకాంక్షలు తెలిపారు. వివిధ అభివృద్ధి పథకాల ద్వారా ఎన్డీఏ (NDA) ప్రభుత్వం మహిళా సాధికారికతకు కృషి చేస్తోందని పేర్కొన్నారు. తన సోషల్ మీడియా అకౌంట్లను ఆపరేట్ చేస్తున్నది మహిళలే అని పేర్కొన్నారు. కాగా ఎప్పుడూ ప్రభుత్వ కార్యక్రమాలతో బిజీబిజీగా ఉండే ప్రధాని ప్రతి సంఘటనపై ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా తన స్పందన తెలియజేస్తూ ఉంటారు.
అయితే అది ఆయనే స్వయంగా వాడరు. ఆయనకంటూ ప్రత్యేక సిబ్బంది ఉంటారు. వాళ్లు ప్రధాని ఆదేశాలు మేరకు పోస్ట్‌లు చేస్తూ వాటిని మెయిటేన్ చేస్తారు. అలా తన ఖాతాలను మెయిటేన్ చేసే వారంతా మహిళలే అంటూ ప్రధాని మోదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలియజేశారు. ప్రధాని మోదీ ఈ ప్రకటన చేసిన కాసేపటికే కొంతమంది ప్రముఖ మహిళలు ప్రధాని మోదీ ఎక్స్ (X)అకౌంట్ నుంచి దేశ మహిళలకు ప్రత్యేక సందేశాలు ఇచ్చారు.
“వనక్కం! మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోషల్ మీడియా ప్రాపర్టీస్‌ను మహిళా దినోత్సవం నాడు తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది. నేను చెస్ ఆడతాను. పలు టోర్నమెంట్స్‌లో దేశానికి ప్రాతినిథ్యం వహించడం గర్వంగా ఉంది.” అని వైశాలి పేర్కొన్నట్లు ప్రధాని మోదీ ఎక్స్ అకౌంట్‌లో తెలిపారు. వైశాలితో పాటు మరో ఇద్దరు సైంటిస్టులు కూడా ప్రధాని మోదీ అకౌంట్ నుంచి తమ సందేశాన్ని ఉమెన్స్ సందర్భంగా దేశ ప్రజలకు ఇచ్చారు.
అణు శాస్త్రవేత్త ఎలినా మిశ్రా, అంతరిక్ష శాస్త్రవేత్త శిల్పి సోనిలు ప్రధాని మోడీ ఎక్స్ అకౌంట్లో పోస్ట్ చేస్తూ.. “అంతరిక్ష సాంకేతికత, అణు సాంకేతికతలో మహిళా సాధికారత. మేము అణు శాస్త్రవేత్త ఎలినా మిశ్రా, అంతరిక్ష శాస్త్రవేత్త శిల్పి సోని, మహిళా దినోత్సవం నాడు ప్రధానమంత్రి సోషల్ మీడియా ప్రాపర్టీలకు నాయకత్వం వహిస్తున్నందుకు మేము సంతోషిస్తున్నాం. సైన్స్‌కు ఇండియా అత్యంత ఉత్సాహభరితమైన ప్రదేశం, ఈ రంగంలో మరింత మంది మహిళలు రావాలని కోరుకుంటున్నాం” అని పేర్కొన్నారు.