భారత్ సమాచార్.నెట్, నేషనల్: భారతదేశంలో (India) అతి పెద్ద రవాణా వ్యవస్థ రైల్వే (Railway) . బ్రిటీష్ కాలంలో మొదలు అయిన ఈ రైల్వే వ్యవస్థ కాలంతో పాటూ అందుకు అనుగుణంగా అప్డేట్ అవుతోంది. ప్రయాణికులు మాత్రమే కాకుండా సరుకు రవాణాను కూడా అతి తక్కువ ధరలో గమ్యస్థానాలకు చేర్చేందుకు భారతీయ రైల్వే (Indian Railways)లు ఎంతో ఉపయోగపడుతున్నాయి. ఆవిరి ఇంజిన్లతో మొదలైన రైల్వే సర్వీసులు.. డీజిల్, విద్యుత్ ఇలా రకరకాలుగా అభివృద్ధి చెందుతూ వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు హైడ్రోజన్‌తో నడిచే రైలు పట్టాలు ఎక్కేందుకు సిద్ధమైంది.
మార్చి చివరిలో ఈ హైడ్రోజన్ రైలు(Hydrozen train) అందుబాటులోకి రానుంది. రీసెర్చ్ డిజైన్ స్టాండర్డ్ సంస్థ ఈ రైలును రూపొందించింది. హైడ్రోజన్‌తో నడిచే ఈ రైలును మార్చి 31న హర్యానా (Haryana)లో ప్రారంభించేందుకు భారతీయ రైల్వే శాఖ సన్నాహాలు చేస్తోంది. హర్యానాలోని జింద్ నుంచి సోనిపట్ మార్గంలో ఈ రైలు నడవనుంది. జింద్-సోనిపట్ మధ్య 90 కిలోమీటర్లు. దీని తర్వాత ఇలాంటివి మరో 35 రైళ్ళను అందుబాటులోకి తీసుకురావాలని రైల్వేశాఖ నిర్ణయించింది. హైడ్రోజన్‌తో నడిచే రైళ్ల వలన పర్యావరణానికి మరింత మేలు చేకూరుతుంది. అంతే కాదు హైడ్రోజన్ రైలు నీటితో నడుస్తుందని అధికారులు తెలిపారు.
40 వేల లీటర్ల నీటిని ఉపయోగించుకునే ఈ హైడ్రోజన్ రైలు.. గంటకు గరిష్ఠంగా 140 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తోంది. ఈ హైడ్రోజన్ రైలు నుంచి వచ్చే శబ్దం కూడా తక్కువే. ఒకసారి ఫ్యూయల్ ట్యాంక్ నింపితే వెయ్యి కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. అలాగే ఈ రైలులో హైడ్రోజన్ సిలిండర్లను ఉంచేందుకు 3 ప్రత్యేక కోచ్‌లు ఉంటాయని సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇకపోతే హైడ్రోజన్ రైలుకు దాదాపుగా రూ.80 కోట్లు ఖర్చు కానున్నట్లు తెలుస్తోంది. వారసత్వ ప్రదేశాలు, కొండ ప్రాంతాల మార్గాల్లో ఈ హైడ్రోజన్ రైళ్లను నడపాలని రైల్వే శాఖ యోచిస్తోంది.