భారత్ సమాచార్.నెట్, తెలంగాణ: తెలంగాణలో (Telangana) ఎమ్మెల్యే కోటాలోని ఎమ్మెల్సీల ఎన్నిక ఏకగ్రీవమైంది. ఈ విషయాన్ని రిటర్నింగ్ అధికారి ఉపేందర్ రెడ్డి సాయంత్రం అధికారికంగా ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ (Congress) నుంచి విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, సీపీఐ నుంచి నెల్లకంటి సత్యం, బీఆర్‌ఎస్ (BRS) నుంచి డాక్టర్ దాసోజు శ్రవణ్‌కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి ఉపేందర్ రెడ్డి ప్రకటించారు. ఎన్నికైన వారికి సర్టిఫికెట్లు కూడా అందజేసిన అనంతరం ఎన్నికైన కొత్త ఎమ్మెల్సీలకు మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు శుభాకాంక్షలు తెలియజేశారు. కాగా మొదటి నుంచే ఈ 5 స్థానాలకు ఎన్నిక ఏకగ్రీవం అవుతాయని తెలిసిందే.
ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు గానూ ప్రధాన పార్టీల నుంచి ఒక్కో సీటుకు ఒక్కో నామినేషన్ వేయగా.. ముగ్గురు ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా నామినేషన్లు వేశారు. అయితే ఇండిపెండెంట్ అభ్యర్థులు నామినేషన్లు నిబంధనలకు అనుగుణంగా లేకపోవడంతో వారి నామినేషన్లు తిరస్కరించారు. దీంతో ప్రధాన పార్టీల అభ్యర్థులే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాగా అసెంబ్లీలో ఎమ్మెల్యేల సంఖ్యాబలం ఆధారంగా కాంగ్రెస్‌కు 4 స్థానాలు రాగా.. వాటిలో ఒకటి పొత్తులో భాగంగా సీపీఐకి కేటాయించారు. కాంగ్రెస్ నుంచి విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్‌లు.. సీపీఐ నుంచి సత్యం నామినేషన్ వేశారు. ఇక బీఆర్ఎస్ నుండి ఒక స్థానం రాగా.. ఆ పార్టీ నుంచి దాసోజు శ్రావణ నామినేషన్ దాఖలు చేశారు.
ఇదిలా ఉంటే ఏకగ్రీవంగా ఎన్నికైన అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, నెల్లీకాంటి సత్యం, దాసోజు శ్రవణ్ నలుగురూ నల్గొండ జిల్లాకు చెందినవారే కావడం విశేషం. అంతేకాదు ఎమ్మెల్సీలుగా ఎన్నికైన అద్దంకి దయాకర్, విజయశాంతి, దాసోజు శ్రవణ్ ముగ్గురూ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వారే. ఈ ముగ్గురూ కూడా దీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉన్నప్పటికీ తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఎలాంటి పదవులూ దక్కలేదు. ఇందులో విజయశాంతి మాత్రం తెలంగాణ ఏర్పాటుకు ముందు సమైఖ్య రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ తరపున ఒకసారి ఎంపీగా ఎన్నికయ్యారు.