భారత్ సమాచార్.నెట్, భద్రాద్రి కొత్తగూడెం: ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి (Bhadrachalam Sita Ramachandraswamy) ఆలయంలో శ్రీరామనవమి (Sri Rama Navami) మహోత్సవాల ప్రారంభ వేళ అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. భద్రాచలంలో ప్రతి ఏడాది జరిగే అతి పెద్ద వేడుక శ్రీరామ నవమి ఉత్సవాలు. శుక్రవారం అంటే మార్చి 14 నుంచి ప్రారంభం కావాల్సిన శ్రీరామ నవమి వేడుకలకు గురువారం అంటే మార్చి 13న సాయంత్రం అంకురార్పణ కార్యక్రమం జరగాల్సి ఉంది. అయితే అంకురార్పణ కార్యక్రమాన్ని ఆరు గంటల పాటు అర్చక బృందం నిలిపివేసింది. అర్చక బృందానికి.. ఆలయ అధికారులకు మధ్య నెలకొన్న వివాదంతో అంకురార్పణ క్రతువు ఆలస్యం అయ్యింది. ఆలయ ఉప ప్రధాన అర్చకుడు లేనిది తాము అంకురార్పణ కార్యక్రమం చేయబోమని అర్చక బృందం తేల్చి చెప్పింది.
అసలు ఏం జరిగిందంటే..?
ఇటీవల ఓ భక్తుడు అభిమనంతో అందించిన నగదును రామాలయం ఉప ప్రధాన అర్చకులు శ్రీనివాసరామానుజం స్వీకరించారు. అయితే నగదు స్వీకరించిన కారణంగా అతడిపై ఆలయ ఈవో రమాదేవి ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతే కాదు క్రమశిక్షణ చర్యల్లో భాగంగా రెండు రోజుల క్రితం అతడిని పర్ణశాల శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయానికి బదిలీ చేశారు.
అయితే ఉప ప్రధాన అర్చకుడు లేకుండా తాము వేడుకలను నిర్వహించలేమని.. శ్రీరామనవమి వేడుకలను పురస్కరించుకొని శ్రీనివాస రామానుజాన్ని మళ్లీ భద్రాచలానికి రప్పించాలని అర్చకులంతా ఈవో రమాదేవిని కోరారు. ఉప ప్రధాన అర్చకుడు లేకుండా శ్రీరామనవమి వంటి పెద్ద మహోత్సవాన్ని నిర్వహించడం కష్టమవుతుందని వివరించారు. ఆలయ కైంకర్యాలు చేయడానికి అతడిని అనుమతించాలని కోరారు. దీనిపై ఆలయ ఈవో నుంచి ఎలాంటి సమాధానంరాకపోవడంతో తాము అంకురార్పణ కార్యక్రమాన్ని నిర్వహించలేమంటూ అర్చక బృందం నిరసన తెలిపింది.
ఈ వ్యవహారంపై అర్చకులకు, ఈవోకు మధ్య సయోధ్య కుదిర్చేందుకు కిందిస్థాయి ఉద్యోగులు గురువారం రాత్రి వరకు గంటల తరబడి చర్చలు కొనసాగించారు. ఫలితం లేకపోవడంతో చివరకు రాత్రి పది గంటల సమయంలో ఈవో రమాదేవి అర్చకుల వద్దకు వెళ్లి చర్చించారు. తప్పు చేసిన ఉప ప్రధాన అర్చకుడిని అర్చకులు వెనుకేసుకొని రావడం ద్వారా ఆలయ ప్రతిష్ట దెబ్బతినే ప్రమాదం ఉన్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. చివరికి ఉప ప్రధాన అర్చకుడిని ఈవో పిలిపించడంతో నవమి వేడుకలు ఆలస్యంగా జరిగాయి.
శ్రీరామ నవమి వేడుకల అంకురార్పణ ఆలస్యం కావడం చర్చనీయాంశం కావడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తంచేశారు. గతంలో ఎననడూ లేని విధంగా ఆలయంలో అపచారం చోటు చేసుకుందని భక్తులు మండిపడ్డారు. కాగా, ఏప్రిల్ 6న జరగనున్న సీతారాముల కళ్యాణానికి సంబంధించి మార్చి 12న రాత్రి 10 గంటల సమయంలో అంకురార్పణ కార్యక్రమం జరిగింది. మరోవైపు శ్రీరామ నవమి సందర్భంగా భక్తుల కోసం భద్రచలంలో సిద్ధం చేసిన తలంబ్రాల బియ్యం పురుగు పట్టడం కూడా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే.