Homebreaking updates newsపంపిస్తున్నామని... లాగేస్తున్నారు!..

పంపిస్తున్నామని… లాగేస్తున్నారు!..

భారత్ సమాచార్.నెట్,అమరావతి: టీ తాగినా.. కూరగాయలు కొన్నా.. ఫర్నిచర్‌ తీసుకున్నా.. విలువ ఎంతైనా.. క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేసి, యూపీఐ ద్వారా డబ్బులు చెల్లించడం సర్వ సాధారణమైంది. ఇది చాలా తేలికగా ఉండడంతో ఎక్కువ మంది దీనికి అలవడ్డారు. మోసాలకు మార్గాలు వెతికి మరీ బురిడీ కొట్టించేలా కేటుగాళ్లు దూసుకొస్తున్నారు. ఈ తరహా చెల్లింపుల విధానంలో సౌకర్యాన్ని తమకు అనుకూలంగా మలచుకుంటున్నారు. డబ్బు పంపుతున్నామని నమ్మబలికి.. ఎదుటి వారి ఖాతా నుంచే సొమ్ము మాయం చేస్తున్నారు. ఏమాత్రం అనుమానం రాకుండా అయిన కాడికి దోచేస్తున్నారు.

రూ. 4.34 లక్షలు పోయాయ్‌..
విజయవాడ అయోధ్యనగర్‌వాసి.. తన ఇంటిని అద్దెకు ఇచ్చేందుకు ఓఎల్‌ఎక్స్‌లో ప్రకటన ఇచ్చారు. అది చూసి ఓ వ్యక్తి ఫోన్‌ చేశారు. తాను ఆర్మీలో పని చేస్తున్నాననీ, బెజవాడకు బదిలీపై వస్తున్నట్లు నమ్మించాడు. ఇంటి ఫొటోలను తనకు వాట్సాప్‌లో పంపమని కోరడంతో పెట్టారు. ఆ ఇల్లు నచ్చిందనీ, బ్యాంకు వివరాలు పంపిస్తే అడ్వాన్స్‌ను ఖాతాలో జమ చేస్తానని చెప్పాడు. ఇంటి యజమాని నిరాకరించారు. మరుసటి రోజు మళ్లీ ఫోన్‌ చేసి, తాను అకౌంట్స్‌ విభాగంలో ఉన్నాననీ, వివరాలు ఇక్కడ కార్యాలయ సిబ్బందికి ఇవ్వాలని చెప్పాడు. క్యూఆర్‌ కోడ్‌ పంపిస్తున్నాననీ.. దానిని స్కాన్‌ చేస్తే డబ్బులు మీకు జమ అవుతాయని నమ్మించాడు. నిజమే అని నమ్మి వచ్చిన క్యూఆర్‌ కోడ్‌ను యజమాని స్కాన్‌ చేశారు. క్షణాల్లో రూ.4.34 లక్షలు ఖాతా నుంచి డెబిట్‌ అయినట్లు మొబైల్‌కు వచ్చిన సంక్షిప్త సందేశాలు చూసి నిర్ఘాంతపోయాడు.
కోడ్‌తో కొట్టేసి..
కృష్ణలంక మహిళ.. ఓ సైట్‌లో తన ఇల్లు అద్దెకు ఇస్తాననీ… ఫోన్‌ నెంబరు ఇచ్చారు. ఓ వ్యక్తి ఫోన్‌ చేసి, తమ కుటుంబం అద్దెకు దిగుతుందని చెప్పాడు. అడ్వాన్స్‌ మొత్తాన్ని యూపీఐ యాప్‌ ద్వారా రూ.40 వేలు పంపుతున్నానని, తాను క్యూఆర్‌ కోడ్‌ పంపుతున్నట్లు.. దానిని స్కాన్‌ చేయాలని చెప్పాడు. నిజమే అని నమ్మిన ఆమె, తన ఫోన్‌కు వచ్చిన ఆ కోడ్‌ను స్కాన్‌ చేశారు. అంతే.. ఆమె ఖాతా నుంచి ఆమేరకు నగదు మాయం అయింది.
అవగాహన లేకుంటే ఖాళీనే…
చెల్లింపు యాప్‌ల్లో ఉండే ‘రిక్వెస్ట్‌’ అనే ఫీచర్‌ను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. మనకు డబ్బు పంపించాల్సిన వ్యక్తికి దీనిని పంపుతూ, కావాల్సిన మొత్తాన్ని ఇందులో నమోదు చేస్తాం. అవతలి వ్యక్తి క్లిక్‌ చేయగానే అంత మేర నగదు, వారి ఖాతా నుంచి పంపిన వారికి జమ అవుతుంది. దీని గురించి తెలియని వారికి, తమకు అంత మొత్తం డబ్బు పంపుతున్నారేమో అని రిక్వెస్ట్‌ను అంగీకరిస్తూ క్లిక్‌ చేస్తారు. దీనివల్ల నగదు పోతుంది. ఈ ఫీచర్‌ను ఉపయోగించి మోసాలకు పాల్పడుతున్నారు. మీకు డబ్బు పంపుతున్నామని వాట్సాప్‌ ద్వారా క్యూఆర్‌ కోడ్‌ను మోసగాళ్లు పంపుతున్నారు. దీనిని స్కాన్‌ చేస్తే నగదు, మీ ఖాతాలో జమ అవుతుందని నమ్మిస్తున్నారు. తీరా స్కాన్‌ చేస్తే.. ఆ మేరకు డబ్బు ఖాతా నుంచి డెబిట్‌ అవుతోంది. కొన్ని యూపీఐ యాప్స్‌లో ఉండే ఈ ఫీచర్‌ను కూడా మోసాలకు ఉపయోగిస్తున్నారు.
RELATED ARTICLES

Most Popular

Recent Comments