భారత్ సమాచార్.నెట్, నేషనల్: జాతీయ విద్యా విధానం (NEP)లో భాగంగా త్రిభాషా విధానంపై కేంద్రం (Central Govt) , తమిళనాడు (Tamil Nadu) మధ్య వివాదం కొనసాగుతోంది. శుక్రవారం జరిగిన జనసేన ఆవిర్భవ సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) దీనిపై మాట్లాడారు. దక్షిణాదిపై హిందీ రుద్దుతున్నారని అన్నప్పుడు తమిళ సినిమాలను హిందీ భాషలో ఎందుకు డబ్బింగ్ చేస్తున్నారని ప్రశ్నించారు. తాజాగా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై డీఎంకే (DMK) స్పందించింది.
భాషా విధానంపై తమ వైఖరిని తప్పుగా అర్థం చేసుకున్నారని డీఎంకే అధికార ప్రతినిధి డాక్టర్ సయూద్ హఫీజుల్లా పేర్కొన్నారు. తాము వ్యక్తిగతంగా హిందీ, ఇతర భాషలు నేర్చుకోవడాన్ని ఎప్పుడు వ్యతిరేకించ లేదన్నారు. ఆసక్తి ఉన్నవారు భాషను నేర్చుకునేందుకు ఇప్పటికే తమిళనాడులో హిందీ ప్రచార సభలు చేపడుతున్నామని తెలిపారు. అయినపప్పటికీ కేంద్రం మాత్రం ఎన్ఈపీ, పీఎం శ్రీ స్కూల్స్ వంటి విధానాలతో తమ రాష్ట్ర ప్రజలపై హిందీ భాషను రుద్దుతున్నారని.. అందుకే దీన్ని తాము వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు.
అలాగే డీఎంకేకు చెందిన మరో సీనియర్ నేత టీకేఎస్ ఎలంగోవన్ (T.K.S. Elangovan) కూడా దీనిపై మాట్లాడారు. 1938 నుంచే తమిళనాడు ప్రజలపై హిందీ భాషను బలవంతంగా రుద్దడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. ద్విభాషా విధానాన్నే అమలు చేస్తామని ఇప్పటికే రాష్ట్ర అసెంబ్లీలో చట్టాన్ని కూడా ఆమోదించమన్నారు. సినీ నటుడు, రాజకీయ నాయకులు అభిప్రాయాలతో ఏకీభవించాల్సిన అవసరం లేదన్నారు. తమిళ రాజకీయాలపై ఆయనకు అవగాహన లేకపోయి ఉండొచ్చన్నారు.
ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై నటుడు ప్రకాష్ రాజ్ (Prakash Raj) విమర్శలు గుప్పించారు. హిందీ భాషను తమిళనాడు ప్రజల మీద రుద్దకండి అని చెప్పడం ఇంకో భాషను ద్వేషించడం కాదన్నారు. ట్విట్టర్ వేదికగా ప్రకాష్ రాజ్ ఇలా రాసుకొచ్చారు.. మీ హిందీ భాషను మాపై రుద్దకండి, అని చెప్పడం ఇంకో భాషను ద్వేషించడం కాదు. స్వాభిమానంతో మా మాతృభాషను, మా తల్లిని కాపాడుకోవడం.. అని పవన్ కళ్యాణ్‌కు ఎవరైనా చెప్పండి ప్లీజ్.. అంటూ కామెంట్స్ చేశారు.