Homebreaking updates newsఅధికారమే లక్ష్యంగా.. తెలంగాణ వ్యాప్తంగా కేటీఆర్ పర్యటన

అధికారమే లక్ష్యంగా.. తెలంగాణ వ్యాప్తంగా కేటీఆర్ పర్యటన

భారత్ సమాచార్.నెట్, హైదరాబాద్: బీఆర్ఎస్ (BRS) పార్టీని మరోసారి అధికారంలోకి తీసుకువచ్చేందుకు మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పర్యటించేందుకు కేటీఆర్ రెడీ అవుతున్నారు. ఏడాదిన్నరలో తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకున్న కాంగ్రెస్ (Congress) సర్కారుపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉందని.. రేవంత్ సర్కార్ కంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) నాయకత్వంపై ప్రజల్లో నమ్మకం ఉందని కేటీఆర్ స్పష్టం చేయనున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 20న సూర్యాపేటలో.. 23న కరీంనగర్‌లో ముఖ్య కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించనున్నారు. బీఆర్‌ఎస్‌ సిల్వర్ జూబ్లీ (Silver Jubliee) సంబరాల విజయానికి దిశానిర్దేశం చేయనున్నారు. ఈ మేరకు బీఆర్ఎస్ పార్టీ ట్విట్టర్ వేదికగా ఓ ప్రకటన విడుదల చేసింది.

 

 

ఈ మేరకు బీఆర్‌ఎస్ సిల్వర్ జూబ్లీ (25) సంబరాలను ఘనంగా నిర్వహించేందుకు ఆ పార్టీ అధిష్టానం ప్రణాళికలు రచించింది. ఇందులో భాగంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనల్లో భాగంగా జిల్లా కేంద్రాల్లో పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సన్నాహక సమావేశాలు నిర్వహించనున్నారు. ఇప్పటికే పార్టీ అధినేత కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ భవన్‌ పార్టీ సినయర్ నేతలు, ప్రజాప్రతినిధులతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా వరంగల్‌లో లక్షలాది మంది పాల్గొననున్న భారీ బహిరంగ సభను విజయవంతంగా నిర్వహించనున్నట్లు పార్టీ ప్రకటించింది.

 

 

14 ఏళ్ల ఉద్యమ ప్రస్థానంతో పాటు, పదేళ్ల ప్రగతి ప్రస్థానంలో తెలంగాణ సమాజంతో బీఆర్‌ఎస్ పార్టీ ఏర్పరుచుకున్న ఆత్మీయ అనుబంధాన్ని ఈ సమావేశాల్లో కేటీఆర్ మరోసారి గుర్తుచేసుకోనున్నారు. ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా గులాబీ జెండాను గుండెల్లో పెట్టుకుని నిలబడ్డ పార్టీ శ్రేణులకు రానున్న రోజుల్లో మళ్లీ ఉజ్వల భవిష్యత్తు ఉండబోతుందని కేటీఆర్ తెలియజేయనున్నారు. పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్తేజాన్ని నింపేందుకు ఆయన పర్యటనలు దోహదపడనున్నాయి అని బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.

 

RELATED ARTICLES

Most Popular

Recent Comments