భారత్ సమాచార్.నెట్: మనం ఏ శుభలేఖల్లో అయినా స్వస్తిశ్రీ చాంద్రమానేన.. అని చదువుతుంటాం. అంటే చాంద్రమానం ప్రకారం జరుపుకునే పండగల్లో ఉగాది పండగది ప్రథమస్థానం. ఉగాది (Ugadi)రోజు నుంచే తెలుగు సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఇది తెలుగువారి మొదటి పండుగ.
‘ఉగాది’ అన్న తెలుగు మాట ‘యుగాది’ అన్న సంస్కృతపద వికృతి రూపం. బ్రహ్మ ఒక కల్పం ప్రళయంతో అంతమై తిరిగి కొత్త బ్రహ్మ కల్పంలో సృష్టిని ఆరంభించిన రోజు. మొదటి ఋతువు వసంత ఋతువులో మొదటి మాసం (చైత్ర మాసం)లో మొదటి తిథి అయిన పాడ్యమి నాడు, మొదటి రోజైన ఆదివారం నాడు యావత్తు సృష్టిని ప్రభవింపజేసాడని అర్థం. అందుకే మొదటి సంవత్సరానికి ‘ప్రభవ’ అని పేరు. చివరి అరవయ్యవ సంవత్సరం పేరు ‘క్షయ’ అంటే నాశనం అని అర్థం.
ఇకపోతే ఈ సారి మనం అడుగిడుతున్న కొత్త తెలుగు సంవత్సరానికి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం అని పేరు. ఇది అష్టవసువుల్లో ఒక వసువు పేరు. దీని అర్థం ఏంటంటే.. శ్రీ అంటే పవిత్రత, శుభత, ఐశ్వర్యాన్ని సూచిస్తుంది. విశ్వావసు అంటే ప్రపంచానికి శుభములు అందుతాయని అర్థం. శ్రీవిశ్వావసు నామ సంవత్సరం శుభాన్ని, ఐశ్వర్యాన్ని అందించే సంవత్సరమని అర్థం. ఈ ఏడాదిలో ఆదాయం పుష్కలంగా లభిస్తుందని పండితులు చెబుతున్నారు. అలాగే కొన్ని దేశాల మధ్య వైరం, యుద్ధ వాతావరణం నుంచి కూడా ఉపశమనం లభిస్తుందట.
హిందువులు తప్పకుండా జరుపుకునే పండగల్లో ఉగాది ఒకటి. ప్రత్యేకమైన ఈ పండుగను ఇంటిల్లిపాదీ ఎంతో ఘనంగా జరుపుకుంటారు. అయితే తెలుగు క్యాలెండర్ ప్రకారం ఉగాది పండుగను ప్రతీ ఏడాది ఛైత్ర మాసంలోని శుక్ల పక్షం పాడ్యమి తిథి నాడు జరుపుకుంటారు. అయితే ఈ ఏడాది కొత్త సంవత్సరం మార్చి 30వ తేదీన వచ్చింది. అయితే తెలుగు క్యాలెండర్లో మొత్తం 60 సంవత్సరాల పేర్లు ఉంటాయి. ప్రతీ ఏడాది ఒక్కో కొత్త సంవత్సరం వస్తుంది. ఈసారి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం వచ్చింది.