భారత్ సమాచార్, ఆధ్యాత్మికం ;
ఈ నెలలో ఎన్నో మంచి రోజులు , విశిష్ట పండుగలు రానున్నాయి.సనాతన ధర్మంలో (హిందూ) చంద్రమానం ప్రకారం మనకున్న పన్నెండు మాసాల్లో ఐదవది ఎంతో పవిత్రత కలిగినటువంటింది శ్రావణమాసం. ఈ నెలలో పౌర్ణమినాడు చంద్రుడు శ్రావణ నక్షత్రంలో సంచరించడం వలన ఈ మాసానికి శ్రావణమాసం అని పేరు వచ్చింది.ఈ మాసంలో ప్రతి ఇల్లు ఆలయాన్ని తలపిస్తుంది. నెల రోజుల పాటు ఉదయం, సాయంత్రం భగవన్నామస్మరణతో మారు మోగుతాయి. శ్రావణంలో చేపట్టే ఎలాంటి కార్యానికైనా ఎంతో పవిత్రత ఉంటుందంటున్నారు పండితులు. అంత గొప్ప పవిత్రమాసం ప్రారంభమైంది.
వర్ష రుతువు ప్రారంభమవుతుంది. త్రిమూర్తుల్లో స్థితికారుడు దుష్ట శిక్షకుడు , శిష్ట రక్షకుడు అయిన మహావిష్ణువుకు ఆయన దేవేరి (భార్య) మహాలక్ష్మికి అత్యంత ప్రీతికరమైన మాసం శ్రావణ మాసంగా చెప్పుకుంటారు. వివిధ రకాల పూజలు , వ్రతాలు ఆచరించడం వల్ల విశేష ఫలితాలు ప్రసాదించే దివ్యమైన మాసంగా పెద్దలు చెబుతారు. మహావిష్ణువు జన్మనక్షత్రం శ్రావణ నక్షత్రం కావడం , అటువంటి పేరుతో ఏర్పడిన శ్రావణమాసం మహావిష్ణువు పూజకు ఎంతో ఉత్కృష్టమైనది. ఈ మాసంలో చేసే దైవ కార్యాలకు ఎంతో శక్తి ఉంటుందని వేద పురాణాలు చెబుతున్నాయి.
శివారాధనకు ప్రత్యేక విశిష్టత
శ్రావణమాసం దక్షిణాయనంలో వచ్చే విశిష్టమైన మాసాల్లో శ్రావణమాసం ఒకటి. ఈ మాసం శివ పూజకు విశిష్టమైనది. ముఖ్యంగా భగవదారాధనలో శివ , కేశవ భేదం లేకుండా పూజించడానికి విశేషమైనది. ఈ నెలలో చేసే ఏ చిన్న దైవకార్యమైనా కొన్ని వేల రెట్లు శుభ ఫలితాన్నిస్తుందని ప్రతీతి. సోమవారాలు పగలంతా ఉపవాసం ఉండి రాత్రి వేళలో స్వామివారికి రుద్రాభిషేకాలు , బిల్వార్చనలు చేస్తే పాపాలు కడతేరుతాయని శాస్త్ర వచనం. సోమవారాల్లో శివుడి ప్రీత్యార్థాం ఈ వ్రతాన్ని (ఉపవాసదీక్షను) చేయాలి. ఈ వ్రతంలో ఉపవాసం ఉండ గలిగినవారు పూర్తిగా , అలా సాధ్యంకానీ పక్షంలో రాత్రి పూజ ముగిసిన అనంతరం ఆహారాన్ని భుజించవచ్చు. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల అనేక శుభ ఫలితాలు కలుగుతాయి. వీటికి తోడు శ్రావణ శుక్ల పక్షంలో గల పదిహేను రోజులు ఎంతో విశేషమైన రోజులనీ ఒక్కోరోజు ఒక్కో దేవుడికి పూజలు చేయాలని వేద శాస్త్రలు చెబుతున్నాయి. ఈ మాసంలో భక్తితో ఆచరించే ప్రతి పూజకు తగిన ప్రతిఫలం ఉంటుందంటున్నారు పండితులు.
శ్రావణమాసంలో ఒక్కో రోజు ఒక్కో దేవతను పూజిస్తారు. సోమవారం- పరమేశ్వరుడు,
మంగళవారం- గౌరీవ్రతం,
బుధవారం- విఠలేశ్వరుడు,
గురువారం- గురుదేవుడు,
శుక్రవారం-లక్ష్మీదేవి,
శనివారం-శనీశ్వరుడు,
వేంకటేశ్వరుడికి పూజలు చేయాలట. పౌర్ణమికి ముందు వచ్చే రెండో శుక్రవారం (ఆగస్టు 16న) వరలక్ష్మీ వ్రతాన్ని జరుపుతారు. వీటితో పాటు సత్యనారాయణ స్వామి, మంగళగౌరీ వ్రతాలు చేస్తే మంచి ఫలితాలు కలుగుతాయని వేద పండితుల మాట.