భారత్ సమాచార్, ‘అక్షర’ప్రపంచం ;
అది 1980వ సంవత్సరం…
కారంచేడు గ్రామం…
మండుతున్న వేసవికాలంలో ఒక ఆడపులి ఆకలితో ఎదురుచూస్తున్న రోజున…
సీత ఇంటి దగ్గర మంచి ఘూటైనా బిర్యాని చేయటానికి పెద్ద పెద్ద మటన్ ముక్కలు నరుకుతున్నాడు జిలాని . సీత, హడావిడిగా పెరట్లో ఉన్న చెట్టుకు కరివేపాకు కోస్తోంది. పెరుగు పచ్చడిలో పైపైన చిన్న, చిన్న అల్లం తురుమును చల్లుతోంది. నిప్పుల కుంపటిపైన వస్తోన్న బిర్యానీ పొగలు చూస్తూ అక్కడే ఒక కుక్క కూర్చొని ఉంది. రెండు వేట ముక్కలు అయినా నాకు విసరకపోతారా అనుకుంటూ ఆశగా ఎదురు చూస్తోంది. దాన్ని గమనిస్తున్న సీత ఒక పెద్ద రాయిని దాని మీదకు విసిరేసింది. కుక్క మూలుగుతూ బాధతో బౌ.. బౌ మంటూ, వీధి గుమ్మం వైపుకు వెళ్లిపోయింది. దూరంగా మేకపోతు తోలు కడుగుతూ, తెచ్చుకున్న వేట కత్తిని నీళ్లతో కడిగి భద్రంగా గోనె సంచుల్లో దాచుకుంటున్నాడు జిలాని. మటన్ బిర్యానీ, పెరుగుపచ్చడి , సాంబారు ఒక టేబుల్ పైన పెట్టి ఇద్దరూ సేద తీరుతున్నారు. ఘాటైన బిర్యానీ వాసన ఊరు మొత్తం తిరుగుతోంది. ఒక చిన్న పళ్లెంలో బిర్యానీ పెట్టి సీత కాకుల కోసం నిలబడి చూస్తోంది. ఆ కాకులన్నీ సీతకి చుట్టాలు. ఇదంతా అర్థంకాని జిలాని అలాగే చూస్తున్నాడు. సీత నవ్వుతూ… మా మతంలో కాకులు వచ్చి తిన్నాయి అంటే, పూర్వికుల ఆత్మల కోర్కెలు నెరవేరినట్లేనని జిలాని తో చెప్తోంది. ఇంతలో చాల కాకులు గుంపులు గుంపులుగా వచ్చి బిర్యాని తింటున్నాయి. ఒక్క కాకి మాత్రం తినకుండా సీత వైపే చూస్తోంది. సీత ఆశ్చర్యంగా చూస్తూ.. ఏదో గుర్తుకొచ్చినట్లు జిలానికి దూరంగా జరిగి తలపైన పైట కొంగు కప్పుకొని నిలబడి ఆ కాకి వైపు చూస్తోంది. కొంత సేపు తర్వాత ఒంటరిగా ఉన్న కాకి కూడా వచ్చి బిరియాని తింటోంది. ఏడాది క్రితం సరిగ్గా శ్రీ రామనవమి నాడు సచ్చిపోయిన సీత భర్త రాము కాకిలాగ అక్కడికి వచ్చాడు. ఇప్పుడు కూడా వాడికి తనపై ఉన్న అనుమానం పోలేదు అనుకుంది సీత. ఇంట్లోకి వెళ్లి గంగాళంలో ఉన్న నీళ్లు నెత్తిపైన పోసుకుంటూ ఏడుస్తోంది. ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించిన వాడు ఊరి పెద్దల చెప్పుడు మాటలు విని తనను అనుమానించి, చివరికి తాగి…తాగి ఆ మత్తులోనే కాలువలో పడి చనిపోయాడు. తనను ఏ దిక్కు మొక్కు లేని ఒంటరిని చేశాడు. పైకి ఉబికి వస్తోన్న కన్నీటిని ఆపుకొని తనలో తానే కుమిలి పోతోంది. మనుషులు కూడా కాకుల్లానే కనిపిస్తున్నారు సీతకి. అవసరానికి అన్నివిధాలుగా వాడుకున్న వాళ్లే తప్ప ప్రేమగా మాట్లాడే మనిషే లేరు సీతకి. భర్తతో పాటుగా మర్చిపోయిన తన అందాన్ని ఆ రోజు మళ్లీ గుర్తుకు తెచ్చుకొని ముస్తాబు అవుతోంది. నుదిటిమీద బొట్టు, నడుము కింద నల్లటి కాటుక పెట్టుకుంది. దిష్టి చుక్కను ఎవరికి కనిపించకుండా చీర కుచ్చీలతో దాచింది. రావాల్సిన అతిథుల కోసం ఇద్దరూ ఎదురు చూస్తున్నారు.
ఊరి మధ్యలో పంచాయతీ చెట్టు నీడ కింద పెద్ద మనుషులు, ఊరి జనాలతో నిండుగా ఉంది. “చూడండి సర్పంచి గారు ఆ సీత బంతులు పెడుతోంది అంట. మీరు వెళితే వెళ్లండి కానీ, మేము ఐతే రాము’’ అని వీరయ్య అన్నాడు. ‘‘అబ్బా… ఒక సారి ఇటు చూడు వీరయ్య, ఏదో మొగుడు లేని ఆడది. దాని కాడ డబ్బులు కూడా లేక ఏడాది నుంచి మొగుడి దినం కూడా చెయ్యలేదు. ఊరికి అరిష్టం కదా అని నేనే పిలిపించి చెప్పితే సరే అని అనింది. బదులుగా డబ్బులు కూడా నేనే ఇచ్చాను కదా’’ అని అన్నాడు సర్పంచి. వీరయ్య సర్పంచి వైపు చూస్తూ….”ఇచ్చారులే ఉన్న నాలుగు కుంటలు కూడా రాయించుకుని”. ఇంతలో సర్చంచి… లేకపోతే, ఉట్టిగా నువ్వు ఇస్తా అంటే చెప్పు దాన్ని రాత్రికి నీ ఇంటికి పంపిస్తా అన్నాడు. అందరికి చెప్తున్న… మళ్లీ వినండి. అది మన కులం కాదు, అయినా మనం వెళ్లాలి. ఎందుకంటే, ఊరికి ఉన్న అరిష్టం పోవాలి. సచ్చినోళ్లకు సంతర్పణ చెయ్యకపోతే దాని కీడు వల్ల ఊరిలో ఎన్ని ప్రాణాలు పొయ్యాయో అందరికి తెలుసు కదా. అందుకే అందరం బంతులకి పోయి వద్దామన్నాడు సర్పంచ్. వాళ్లు కూడా ఇక మాట్లాడేది ఏం లేక అంగీకరించారు. అక్కడి నుంచే అందరు కలిసి సీత ఇంటికి బయలుదేరారు. ఎదురుగా వస్తున్నా సర్పంచిని, ఊరి జనాల్ని, చూస్తూ ఆనందగా వాళ్లకి చెంబుతో నీళ్లు ఇచ్చి… లోపలికి రమ్మని పిలుస్తోంది సీత. జిలాని అందరికి ఇస్తరాకు వెయ్ అంటూ హడావిడి చేస్తోంది. వేటకూరా బిర్యానీ ముక్కల మసాలా అందరి ముక్కుల నషాళానికి తాకుతోంది. మొత్తం ఒక ముప్పై మంది మగాళ్లు ఉన్నారక్కడ. ముక్కలకి బాగా మసాలా పట్టిన బిరియానిని లొట్టలు వేసుకుంటూ మళ్లీ ఇలాంటి బిర్యానీ దొరకదేమో అన్నట్టు తింటున్నారు. సీత, జిలాని వైపు చూస్తూ నవ్వుతోంది. గుమ్మం దగ్గరకు వస్తోన్న కుక్క మౌనంగా నిలబడిపోయింది.
సీతను అడిగి మరి ఎక్కువ ముక్కలు వేయించకుని తింటున్న సర్పంచ్, నవ్వుతూ….”చూడండి రా, మొగుడు దినం కూడా ఎంత గొప్పగా చేస్తోందో, ఆడది అంటే సీతే రా. అందరూ నవ్వుతున్నారు. హా… అవును, నిజమే…అంటూ, ఇంతలో వీరయ్య, అవునే సీత, ఊరిలో ఉన్న అందరికి చెప్పకుండా కేవలం ఊరి పెద్ద కులపు వాళ్లనే పిలిచావేంటి ? కావాలంటే, సర్పంచ్ గారు, మేమందరం కలిసి చందాలు వేసుకుని డబ్బులు ఇచ్చే వాళ్లం కదా. ఏదో ఆలోచిస్తున్న సీత వెంటనే తేరుకొని, వీరయ్య గారు… నాకు ముఖ్యం అనుకున్న వాళ్లనే పిలవాలనుకున్న అంటూ అందరికి బిర్యానీ వడ్డిస్తోంది. బ్రహాండంగా ఉంది ముక్క అంటూ తింటున్న సర్పంచు, నోట్లో నురుగ కక్కుకుంటూ కింద పడిపోయాడు. అందరూ ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. ఆ షాక్ నుంచి పూర్తిగా తేరుకోక ముందే అందరూ కూడా అలాగే నోట్లో నురుగ కక్కుకుంటూ కింద పడి కొట్టుకుంటున్నారు. సీత చాలా పెద్దగా నవ్వుతోంది. ఇంకా, ఇంకా పెద్దగా నవ్వుతోంది.ఇదంతా ఏం అర్థం కాని జిలాని కొంత ఆశ్చర్యంగా.. మరి కొంత ఆందోళగా భయపడుతూ చూస్తున్నాడు. కింద పడి కొట్టుకుంటున్న జనాల్ని చూస్తోన్న సీత…” ఇప్పుడు వినండి రా, ఇది నా మొగుడు చావు దినం కాదు, మీరు చావటానికి పెట్టిన చావు విందు బిర్యాని. ఎవరూ లేని, ఏమీ లేని ఒంటరి దాన్ని చేసి, నాపైన ఎక్కిన మగాళ్లంతా ఇక్కడే ఉన్నారు. మిమ్మల్ని ఒక్కొక్కరిగా ఎలా చంపాలో తెలీక, ఇలా నా మొగుడు దినం అంటూ మిమ్మల్ని అందరిని పిలిచి మీరు తిన్న బిరియానీలో సైనేడ్ లాంటి విషం కలిపా” అంటూ గట్టిగా నవ్వుతూ, కుచ్చిళ్లు ఎగ దోపుతూ చావు నాట్యం చేస్తోంది. వాళ్ల శవాల మధ్య కాళికాదేవిలా సీత కనిపిస్తోంది. ఏం మాట్లాడాలో, ఏం చేయాలో తెలీక జిలానీ అక్కడే నిలబడిపోయాడు.
సరిగ్గా నవమి నుంచి సీత అనుభవిస్తున్న వ్యథ పండుగ పూట వీళ్ల చావుతో తీరిపోయింది. సీత మనసు చాలా తేలిక అయిపోయింది.
ఇట్లు
మీ రచయిత
రామ్ యలగాల
8019202070