Homemain slidesఎంగిలి స్నేహం కూడా...

ఎంగిలి స్నేహం కూడా…

భారత్ సమాచార్, అక్షర ప్రపంచం ;

కొద్ది మంది భూతల స్వర్గంలా భావించే అమెరికా దేశంలో, ఆకాశహర్మ్యాలు ఉన్న నగరంలో, పూర్తిగా పుస్తకాలతో నిండిపోయిన ఓ ఇరుకు గదిలో. భారతీయ విద్యార్థి రాము శాంటా విశ్వవిద్యాలయంలో “హ్యూమన్ రిలేషన్స్” అనే అంశంపై కొంత కాలంగా పీహెచ్‌డీ సాధించటానికి ప్రయత్నిస్తున్నాడు. విశ్వ మానవ జీవపరిణామక్రమ పుట్టుపూర్వోత్తారాలను పూర్తిగా అధ్యాయం చేయటానికి చార్లెస్ డార్విన్ జీవపరిణామ క్రమ సిద్దాంతాన్ని మళ్లీ మళ్లీ తిరగేస్తున్నాడు. చేతిలో పుస్తకం పక్కనే సగం తాగి వదిలేసిన మందు గ్లాస్. అందులో ఒక బొద్దింక పడిపోయి మద్యం అలలమీద లేవటానికి ప్రయత్నిస్తూ, మళ్లీ మళ్లీ మునిగిపోతోంది. అలా చావలేక బతకలేక కొట్టుకుంటున్న బొద్దింకను రాము నిశితంగా గమనిస్తున్నాడు. ఆ గ్లాస్ చుట్టూనే ఒక కందిరీగ జూ…జూ… అంటూ తిరుగుతోంది. అది అలా ఎందుకు తిరుగుతుందో, వాటి మద్య ఉన్న సంబంధం ఎమిటో రాముకి అర్థం కావటం లేదు. సరిగ్గా బొద్దింక చనిపోతుందనే సమయానికి రాము తన చేతిలో ఉన్న సిగరేట్ తో ఆ బొద్దింకను గ్లాస్ లో నుంచి బయటకు తీసేస్తాడు. మొత్తానికైతే ఈ రోజుకి బతికేసాను అనుకుంటూ రెక్కల్ని దులుపుకుంటోంది బొద్దింక. చచ్చి బతికావ అని పలకరిస్తూ బొద్దింక పక్కన కూర్చుంది కందిరీగ. జస్ట్ రెండు సెకన్లు లేటు చేసి ఉంటే ఈ పాటికి పోయేదాన్నే… వీడు ఏంటి మరీ ఇంత సైకోలా ఉన్నాడు అని అంటోంది బొద్దింక.
అప్పుడు కందిరీగ …
ఓరేయ్ బొద్దింక, అసలు నువ్వు వాడి జోలికి ఎందుకు వెళ్ళావు…? అదా, అక్కడ మురికి గుంట వాసన వస్తోంది కదా, కొద్ది సేపు హాయిగా నిద్రపోదాం అనుకున్నా అని అంటోంది బొద్దింక. కందిరీగ నవ్వుతూ…. రేయ్ జాతి తక్కువ నా కొడకా, నీతో తిరుగుతున్నా చూడు నాది రా తప్పు.
బొద్దింక చూస్తూ….
రేయ్ కందిరీగ మీలాగా మేము పువ్వుల పై ఉండే తేనెను దోచుకోవటం లేదు కదా. మేము ఇంతే, మా జాతి ఇంతే.
కందిరీగ చూస్తూ….
చెప్పిన సొల్లు చాలుకానీ కొంచెం నిమ్మలంగా ఉండు. వాడు మనల్నే గమనిస్తున్నాడు. భూతద్దంతో వాటిని పరిశీలిస్తూ ఆ సగం గ్లాస్ లోని మందునే తాగేసాడు రాము. డార్విన్ జీవపరిణామక్రమ సిద్ధాంతాన్ని రూపొందించే క్రమంలో అడివిలో ఉన్న జంతువుల కళేబరాన్ని తిన్నాడు. కొన్ని సందర్భాల్లో వాటి మలం కూడా తిన్నాడు కదా అని ఆలోచిస్తూ కునుకు తీస్తున్నాడు రాము. ఈ మొత్తాన్ని కూడా ఒక చీమ గమనిస్తోంది.

ఉషోదయం కానీ ఓ సరస్సులో, కలువల పైన ఉండే పుప్పొడి తినటానికి బొద్దింక నానా ఇక్కట్లు పడుతోంది. పుప్పొడి తినడం రాని బొద్దింకను చూస్తూ కందిరీగ తెగ నవ్వుతోంది. రేయ్, బొద్దింక అలా కాదు రా వాటిని తినటం, కాసేపు ఆగు, సూర్యుడు వస్తాడు. కలువలు నిద్రలేస్తాయి. అంటూ ఆకాశంలో తిరుగుతున్నాయి కందిరీగలు. ఓరేయ్ కందిరీగ, మా జాతి వాళ్లు మీ బంగారాన్ని తింటే నన్ను కొట్టరా ..? కందిరీగ…రేయ్ ముందు నువ్వు వాటి రుచి చూడు, అంతేకాని నీ మురికి గుంట ఆలోచనలతో నన్ను విసిగించకు. సూర్యుడి కిరణాలకు మెల్లగా విచ్చుకుంటున్న కలువలు సూర్యోదయ కాంతుల అందంతో నవ్వుతున్నాయి. చిన్న పడవలో అక్కడికి చేరుకున్న కృష్ణ ఆ కలువల్ని చూసి సంతోషంగా ఉన్నాడు. సూర్య కిరణాలు సరస్సుపై మరింత ప్రకాశవంతంగా పడుతున్నాయి. కలువలు ఎక్కడెక్కడ ఉన్నాయో కృష్ణ కి ఇప్పుడు పూర్తిగా కనిపిస్తున్నాయి. వెంట తెచ్చుకున్న కొడవలితో వేగంగా కలువల్ని కోస్తున్నాడు కృష్ణ. వాటిని మోపులుగా కట్టి తన పడవలో వేసుకుంటున్నాడు. పడవ కలువలతో నిండిపోయింది. కృష్ణ సంతోషంగా తను తెచ్చుకున్న సద్ది తింటున్నాడు. పులిసిన పెరుగు వాసనకు బొద్దింక వెళ్లి ఆ సద్దిలో పడిపోయింది. సద్దిని కలుపుతుంటే దాని మద్య పచ్చిమిరపకాయలాగా బొద్దింక నలిగిపోయింది. కందిరీగ కృష్ణ చుట్టూ తిరుగుతూ జోరుగా అరుస్తోంది. అది కృష్ణ కు విసుగు తెప్పిస్తోంది. పక్కనే ఉన్న తుండుని తీసుకొని దాంతో కందిరీగను కొట్టాడు. అది వెళ్లి నీటిలో పడిపోయింది. రెక్కలకు తడి అంటుకోవటం వల్ల పైకి ఎగరలేక కొట్టుకుంటోంది కందిరీగ. సద్ది తినేసిన కృష్ణ, కలువ పువ్వుల్ని మూటలుగా కట్టుకొని అవి వాడిపోక ముందే మార్కెట్లో అమ్ముకోటానికి తిరుగు పయనమయ్యాడు.

పాపం కందిరీగ, పాపం బొద్దింక స్నేహం కోసమే బతికారు. స్నేహం కోసమే పోయారు. ఎక్కడ అమెరికా ..? ఎక్కడ భారతదేశం..? ప్రపంచం వాళ్ల స్నేహాన్ని గుర్తించలేదు. నువ్వు అయినా వాళ్ల గురించి చెప్పు అంటూ నాతో పాటు ఉన్న చీమ నన్ను కుట్టి కుట్టి మరీ చెబుతోంది. అమెరికాలో ఉన్న చీమ నా దగ్గర ఉన్న చీమ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. వాళ్లిద్దరూ చెబుతుంటే రాసిన కథ ఇది. ఇంకా అమెరికాలో పీహెచ్‌డీ చేస్తున్నోడు, చెరువుల్లో పువ్వులు కోసి అమ్ముకునేవాడు చిన్నప్పుడు ఒక్కటే ఎంగిలి తిన్న సావాసగాళ్లు. కానీ, ఇప్పుడు పలకరింపులు కూడా లేకపోయే.
వయస్సుని బట్టి మర్యాదలు పోయే,
డబ్బుని బట్టి అర్హతలు పెరిగిపోయే,
ఎంగిలితిన్న స్నేహం కూడా గుర్తుకులేకపోయే…
అంటూ నా కలం రాసుకుంటూ పోతోంది…

ఇట్లు
మీ రచయిత
రామ్ యలగాల
8019202070

మరికొన్ని ప్రత్యేక కథనాలు…

నవమినాడు పీడ పోయింది… సీత మనసు తేలికైంది

RELATED ARTICLES

Most Popular

Recent Comments