భారత్ సమాాచార్, సినీ టాక్స్ : ‘‘ఓ చినదాన’’ అనే సినిమాలో హీరో శ్రీకాంత్ పక్కన మరో హీరోగా నటించాడు రాజా. ఆ తర్వాత స్టార్ డైరెక్టర్ శేఖర్ కమ్ములకి ‘ఆనంద్’ సినిమాతో ఫస్ట్ హిట్ ఇచ్చాడు. ఈ మూవీ ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు యూత్ ను బాగా ఆకట్టుకుంది. చూడడానికి సాదాసీదాగా కనిపించే రాజా దశాబ్దకాలం పాటు తెలుగు సినిమాల్లో నటించాడు. 30 సినిమాల్లో హీరోగా నటించాడు. చివరగా 2013లో ‘‘ఓ మై లవ్’’ అనే సినిమా తర్వాత ఇండస్ట్రీలో ఉండకూడదని డిసైడ్ అయ్యాడు.
సినిమా రంగం నుంచి బయటకు వచ్చిన రాజా చర్చిలో పాస్టర్ గా మారిపోయాడు. ప్రస్తుతం ముషీరాబాద్ లోని ద న్యూ కెవినెన్ట్ చర్చిలో భక్తులకు దైవ ప్రవచనాలు చెబుతున్నాడు. దైవజనుడి అవతారమెత్తిన రాజా హెబెల్ అసలు పేరు కృష్ణమూర్తి. స్వతహగా బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందినవారు. రాజా తల్లి చిన్నప్పుడే చనిపోయారు. ఊహ తెలిసిన తర్వాత తండ్రి దూరమవడంతో రాజా క్రిస్టియన్ గా మారిపోయారు. తన పేరును రాజా హెబెల్ గా మార్చుకున్నారు.
హీరో రాజాకు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. రాజా వైఎస్ చనిపోకముందు ఆయనకు మద్దతుగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత రాజకీయాలకూ దూరమై ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తున్నారు. ఉన్నదాంట్లో తృప్తి చెందడం, ఆధ్యాత్మిక జీవితాన్ని గడపడడం చాలా మనశ్శాంతిని కలిగిస్తుందని రాజా చెబుతున్నారు. ఇక బలవంతపు మతమార్పిళ్లకు తాను వ్యతిరేకినని, ఎవరికీ నచ్చిన మార్గంలో వారి ఇష్ట దైవాన్ని పూజిస్తే తప్పు లేదంటున్నారు.
గొప్ప పేరు, బోలెడన్ని సినిమా అవకాశాలు, డబ్బు ఇవన్నీ వదులుకుని తాత్విక జీవితాన్ని కొనసాగిస్తున్న రాజా హెబెల్.. ఇప్పుడున్న పాస్టర్ లైఫ్ కూడా చాలా సంతృప్తిని ఇస్తోందన్నారు. భగవంతుడు ఎలా నిర్ణయిస్తే మన జీవితం అలాగే ముందుకెళ్తుందని వేదాంత ధోరణిలో రాజా చెప్పుకొచ్చారు.