భారత్ సమాచార్.నెట్, ఏపీ: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవారు కొలువై ఉన్న తిరుమల (Tirumala) క్షేత్రాన్ని కాంక్రీట్ జంగిల్ కానీయొద్దని ఏపీ హైకోర్టు(AP High Court) వ్యాఖ్యానించింది. తిరుమల కొండపై అక్రమ నిర్మాణాలు (Illegal constructions) ఇలానే కొనసాగిస్తే కొంతకాలం తర్వాత అక్కడి అటవీ ప్రాంతం కనుమరుగవుతుందని హైకోర్టు ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. తిరుమలలో నిబంధనలకు విరుద్ధంగా ఇష్టానుసారంగా ధార్మిక సంస్థలు నిర్మాణాలు చేపడుతున్నాయని.. అయిన టీటీడీ అధికారులు చర్యలు చేపట్టడం లేదని తిరుపతికి చెందిన మహేష్ అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించారు. ఆ నిర్మాణాలు జరగకుండా టీటీడీకి ఆదేశాలు ఇవ్వాలని పిల్‌లో కోరారు.
తాజాగా దీనిపై ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకుర్(Dhiraj Singh Thakur), జస్టిస్ చీమలపాటి రవి (Cheemalapati Ravi)లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారించింది. ఈ మేరకు తిరుమలలో అక్రమ నిర్మాణాలపై హైకోర్టు ఈ విధంగా స్పందించింది. తిరుమలలో నిర్మాణాల విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని టీటీడీకి సూచించింది. తిరుమల కొండపై జరిగే నిర్మాణాలపై నిరంతరం ఓ కన్నేసి ఉంచాలని టీటీడీ (TTD)కి ఆదేశాలు ఇచ్చింది హైకోర్టు. ఇకపై ధార్మిక సంస్థలమని చెప్పుకొంటూ ఇష్టారాజ్యంగా తిరుమలలో నిర్మాణాలు చేస్తామంటే కుదరదని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ దేవదాయశాఖ ముఖ్య కార్యదర్శి, టీటీడీ ఈవో పలు మఠాలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను మే 7కు వాయిదా వేసింది.
ఇదిలా ఉంటే తిరుమలలో ఈ నెల 15న వెంకటపాలెం శ్రీవారి ఆలయ ప్రాంగణంలో శ్రీనివాస కళ్యాణం (Srinivasa Kalyanam ) జరగనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులకు టీటీడీ ఈవో జె శ్యామలరావు ఆదేశాలు జారీ చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కళ్యాణ వేదిక పరిసరాల్లో అవసరమైన గ్యాలరీలు, క్యూ లైన్లు ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే శ్రీవారి కళ్యాణాన్ని నేరుగా చూడలేని భక్తుల కోసం శ్రీనివాస కళ్యాణాన్ని ఎస్వీబీసీ (SVBC) ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయనుంది టీటీడీ.