భారత్ సమాచార్, అమరావతి ;
అమరావతి రాష్ట్ర సచివాలయం మొదటి బ్లాకు కేబినెట్ సమావేశ మందిరంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంత్రి మండలిలో పలు విషయాలను తీవ్రంగా చర్చించి కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను వెలగపూడిలోని సచివాలయం భవనంలో రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖామంత్రి కొలుసు పార్థసారధి మీడియాకు వివరించారు.
1. ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ – 2022 రద్దును ఆమోదిస్తూ కేబినెట్ తీర్మానం..ఈ చట్టాన్ని రద్దు పరచడానికి ఏపీ టైటిలింగ్ అథారిటీ ప్రస్తావించిన కారణాలు : నీతి ఆయోగ్ రూపొందించిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రకారం టీఆర్ వో గా ప్రభుత్వ అధికారి ఉండాలి. కానీ ఆ స్థానంలో గత ప్రభుత్వం ఎటువంటి అర్హత లేని వ్యక్తులను కూర్చోబెట్టేందుకు అవకాశం కల్పించే విధంగా మార్పులు చేసింది. ఈ యాక్ట్ ప్రకారం సివిల్ కోర్టుల ప్రమేయం పూర్తిగా తుడిచివేయబడుతుంది. టీఆర్ వో దగ్గర సమస్య ఉత్పన్నమైతే నేరుగా వ్యయప్రయాసలకోర్చి హైకోర్టును ఆశ్రయించాల్సిన పరిస్థితి. వీటితో పాటుగా మరికొన్ని కారణాలతో ఈ చట్టాన్ని రద్దు చేసినట్లు ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
2. ఇసుక, గనుల పాలసీ – 2019 మరియు మరింత మెరుగైన ఇసుక విధానం -2021లను రద్దుచేస్తూ ఉచిత ఇసుక మెకానిజం -2024 ఏర్పాటు అయ్యేంత వరకు ప్రభుత్వానికి ఆదాయం లేకుండా ప్రజలకు ఉచితంగా ఇసుకను అందించే మధ్యంతర వ్యవస్థ ఏర్పాటు చేసేలా తేదీ: 8.7.2024న జారీ చేసిన జీవో ఎం.ఎస్ నంబర్ 43 కు కేబినెట్ ఆమోదం..
3. 2024-25 సంవత్సరానికిగానూ ధాన్యం కొనుగోలు ప్రక్రియ కోసం రూ.2000 కోట్ల రుణాన్ని వాణిజ్య బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుండి రాష్ట్ర ప్రభుత్వ పౌర సరఫరాల సంస్థ పొందేలా అనుమతిస్తూ తేది: 28.6.2024 నాడు రాష్ట్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార మరియు పౌర సరఫరాల శాఖ జారీ చేసిన జీవో ఎం.ఎస్ నంబర్ 6 లో రాష్ట్ర ప్రభుత్వ హామీని కోరుతూ చేసిన ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం..
4. 2024-25 సంవత్సరానికిగానూ ధాన్యం కొనుగోలు ప్రక్రియ కోసం ఏపీ మార్క్ ఫెడ్ కు ఎన్ సీ డీసీ (నేషనల్ కో ఆపరేటివ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్) నుండి వర్కింగ్ కేపిటల్ అసిస్టెన్స్ రూపేణా రూ.3,200 కోట్ల కొత్తగా రుణాన్ని పొందేందుకు గానూ రాష్ట్ర ప్రభుత్వ హామీని కోరుతూ వ్యవసాయ, సహకార శాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం..
మీటింగ్ లో చర్చించిన ఇతర ముఖ్య అంశాలు…
ప్రకృతి వ్యవసాయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అంతర్జాతీయ స్థాయిలో అత్యంత ప్రతిష్టాత్మక గుల్బెంకియన్ అవార్డు వచ్చిందని, ఇది వ్యవసాయ రంగంలో నోబెల్ ప్రైజ్ తో సమానమని,ఈ అవార్డు క్రింద 9 కోట్ల రూపాయలు వచ్చింది. ఈ ప్రకృతి సేద్యాన్ని 2018 లో నాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో 5 లక్షల హెక్టార్లతో ప్రారంభమై 10 లక్షల మంది రైతులను భాగస్వామ్యులను చేయడం జరిగింది. ఎలాంటి రసాయనాలు వినియోగించకుండా చేస్తున్న ప్రకృతి సేద్యం ప్రస్తుతం 4 రెట్లు పెరిగి 2029 నాటికి 20 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ప్రకృతి సేద్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రపంచానికి మార్గదర్శిగా నిలిచి ఆదర్శ ప్రాయం అవుతుందని ముఖ్యమంత్రి కేబినెట్ కి తెలియజేశారు.