భారత్ సమాచార్, అమరావతి ;
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నియంతలా వ్యవహరిస్తున్నారని ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎక్స్ వేదికగా ఆరోపించింది. ప్రజాస్వామ్యంలో కీలకపాత్ర పోషించే మీడియాను ఏపీ ప్రభుత్వం అణచివేస్తుందని రాసుకొచ్చింది. ప్రభుత్వ అధికార దుర్వినియోగం, అవినీతిని ప్రశ్నిస్తున్నందుకు కొన్ని తెలుగు టీవీఛానళ్లపై కక్షకట్టారని తెలిపింది. తెలుగు మీడియాలో అత్యంత ప్రజాదరణ పొందిన సాక్షి టీవీ, ఎన్ టీవీ, టీవీ 9 న్యూస్ ఛానళ్ల పై ఏపీ సీఎం కత్తి కట్టారని విమర్శించింది. రాష్ట్రంలో ఎక్కడా ఈ ఛానళ్లు ప్రసారం కాకూడదని హుకుం జారీచేశారని తెలిపింది. దీంతో ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ కేబుల్‌ఆపరేటర్లు ఆయా ఛానళ్లప్రసారాలను ప్రస్తుతం నిలిపేశారని పార్టీ పేర్కొంది. అమరావతిలోని రాష్ట్ర సచివాలయం వేదికగా మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధ్యక్షతన కేబుల్ ఆపరేటర్లతో సమావేశంపెట్టి మరీ ఈ దారుణాలను చేపట్టారని వ్యాఖ్యానించింది. పోలీసు ఇంటెలిజెన్స్ చీఫ్ మహేష్ చంద్రలడ్డా సహా మరికొందరు అధికారులు ఈ సమావేశంలో పాల్గొనడం అధికార దుర్వినియోగానికి నిదర్శనంగా పేర్కొంది . రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం నడుస్తోందని చెప్పడానికి ఇది ప్రత్యక్ష ఉదాహరణ వైసీపీ పార్టీ అధికారిక ఎక్స్ ఖాతాలో రాసుకొచ్చింది.