HomeUncategorizedప్రతి భారతీయ విద్యార్థికి ‘అపార్’ కార్డు

ప్రతి భారతీయ విద్యార్థికి ‘అపార్’ కార్డు

భారత్ సమాచార్, విద్య ;

ప్రస్తుతం ప్రతి భారతీయ పౌరుడికి ఆధార్ కార్డు ఎలాగో, ఇక మీదట ప్రతి భారతీయ విద్యార్థికి కూడా ‘అపార్’ కార్డును కేంద్ర ప్రభుత్వం జారీ చేయనుంది. జాతీయ విద్యా విధానం అమలులో భాగంగా ఆధార్ తరహాలో విద్యార్థులకు ప్రత్యేక గుర్తింపు కార్డు అందించాలని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఇటీవల నిర్ణయించింది.’వన్ నేషన్- వన్ స్టూడెంట్’ నినాదంతో విద్యార్థులకు 12 అంకెలతో కూడిన అపార్ (ఆటోమేటెడ్ పర్మినెంట్ అకాడమీ అకౌంట్ రిజిస్ట్రీ) నంబర్ కేటాయించనుంది. జాతీయ నూతన విద్యా విధానంలో (ఎన్ఐపీ) భాగంగా ప్రతి విద్యార్థికి పూర్తి సమాచారంతో అపార్ పేరుతో డిజిటల్ లాకర్‌కు అనుసంధానం చేస్తూ పర్మినెంట్ గుర్తింపు కార్డును అందించనుంది. ఇకపై ప్రతి భారతీయ విద్యార్థికి అపార్ (ఆటోమేటెడ్ పర్మినెంట్ అకాడమీ అకౌంట్ రిజిస్ట్రీ) కీలక పాత్ర పోషించనుంది. ప్రతి విద్యార్థికీ ప్రత్యేకంగా ఒక నంబర్‌ను కేటాయించి.. అందులో విద్యార్థికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని నిక్షిప్తం చేయనుంది. యూడైస్ ప్లస్ వెబ్‌సైట్ వేదికగా జాతీయ స్థాయిలో అపార్ నంబర్‌ను కేటాయించేందుకు జిల్లాల యంత్రాంగానికి తాజాగా ఆదేశాలు జారీ చేసింది.

ప్రస్తుతం ప్రతి జిల్లాలోని పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థుల అపార్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. విద్యార్థి భవిష్యత్తుకు అపార్ కీలకం. విద్యార్థి ఉన్నత చదువులకు, ఉపాధి, ఉద్యోగాలలో అపార్ కార్డు కీలకంగా మారనుంది. పుట్టిన తేదీ నుంచి విద్యార్థి పూర్తి వివరాలు, 12 అంకెలతో కూడిన ఐడీ, క్యూఆర్ కోడ్ డిజిటల్ కార్డు రూపంలో భద్రపరుస్తారు. విద్యార్థి చదువుకు సంబంధించిన మార్కుల జాబితా, వ్యక్తిగత సమాచారం, సాధించిన విజయాలు, క్రీడలలో సాధించిన ప్రతిభ, అవార్డులు, పురస్కారాలు ఎప్పటికప్పుడు అపార్‌లో తప్పనిసరిగా నమోదవుతుంటాయి. సంబంధిత విద్యార్థి సమాచారం తెలుసుకోవాలంటే అపార్ కార్డు క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే విద్యార్థి బయోడేటా పూర్తిగా తెలుసుకోవచ్చు. ఉద్యోగాల భర్తీ, ఉపకార వేతనాలు, ఇంటర్వ్యూలు, ఉన్నత విద్య ప్రవేశాల సమయంలో ఇది ఎంతగానో ఉపయోగపడనుంది. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న ప్రతి విద్యార్థికి కూడా అపార్ కార్డు తప్పనిసరి. తొలి దశలో 9 నుంచి ఇంటర్ వరకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో జిల్లా విద్యా శాఖ అధికారులు తొలి దశలో 9, 10, ఇంటర్ విద్యార్థులకు అపార్ కార్డును అందించే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభించింది. యూడైస్ ప్లస్ వెబ్‌సైట్‌లో విద్యార్థి పెన్ (పర్మినెంట్ ఎడ్యుకేషన్ నంబర్) నంబర్, వ్యాలిడిటీ ఆధార్ నంబర్ ఉండేలా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నూతన విధానంపై విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించేందుకు ప్రతి పాఠశాలలోనూ తల్లిదండ్రుల సమావేశాన్ని ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తున్నారు. ఒక్కసారి కార్డు వచ్చిందంటే మార్పులకు అవకాశం ఉండకపోవడంతో విద్యార్థుల వివరాలు అక్షరం తప్పులు లేకుండా నమోదు చేస్తున్నారు.
కేజీ టూ పీజీ విద్యార్థులకు సైతం అపార్ అందించేందుకు కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ అపార్ కార్డు ప్రతి ఒక్కరూ తప్పకుండా పొందాల్సి ఉంటుంది.

మరికొన్ని ప్రత్యేక కథనాలు...

ఐఐటీ అడ్మిషన్ న్యూ రూల్స్‌ ఇవే…

RELATED ARTICLES

Most Popular

Recent Comments