భారత్ సమాచార్, రాజకీయం : కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు అమలుచేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చింది. సీఎం ప్రమాణ స్వీకారం అయిన రెండు రోజులకే రెండు గ్యారెంటీలను అమల్లోకి తెచ్చింది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, ఆరోగ్యశ్రీ పరిధిని రూ.10లక్షలకు పెంచడం వంటి అందుబాటులోకి తెచ్చింది. అయితే ఈ పథకాలతో ప్రభుత్వానికి ఇప్పటికిప్పుడు పెద్దగా ఖర్చు అయ్యేది ఏముండదు.. కానీ మిగతా నాలుగు గ్యారెంటీలను అమలు చేయడమే పెద్ద టాస్క్.
గ్యారెంటీలను గ్యారెంటీగా అమలు చేస్తామని చెపుతున్న కాంగ్రెస్ ను రాష్ట్ర ఆర్థిక పరిస్థితి షాక్ గురిచేసింది. 6.71లక్షల కోట్ల అప్పుతో ఖజానా ఖాళీగా ఉందని శ్వేతపత్రం ద్వారా తెలిసింది. ఇప్పుడు ఆ పార్టీ ఆర్థిక వ్యవస్థను గాడీలో పెట్టడం తప్ప వేరే మార్గం కనపడడం లేదు. ‘‘హామీలు నెరవేర్చేక పోతే ప్రజలు ఊరుకోరు.. అమలు పరిస్తే మరింత అప్పుల కుప్ప అవుతుంది..’’ దీంతో కాంగ్రెస్ పరిస్థితి ముందు నుయ్యి.. వెనక గొయ్యి అన్నట్టుగా మారిందనే చెప్పాలి. గత ప్రభుత్వం చేసిన అప్పులు ఈ ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారాయి. వచ్చే నెల నుంచి పింఛన్లు పెంచుతామన్నారు.. దానిపై కూడా క్లారిటీ ఇవ్వడం లేదు.
ఆరు గ్యారెంటీలను అమలు చేయాలంటే రూ.1.29 లక్షల కోట్ల బడ్జెట్ అవసరమవుతుందని అంచనా. ఈక్రమంలో తెలంగాణ సర్కార్ 2023-24 సంవత్సరానికి రూ.38,234 కోట్లు అప్పులు తెచ్చుకునే అవకాశం ఉండగా.. అక్టోబర్ నాటికి రూ.33,378 కోట్ల మేర అప్పుల చేయడంతో ఆదాయ మార్గాలేవీ కనపడడం లేదు. ఆదాయ మార్గాలు కనపడక పోవడంతో నిధులు ఎలా సమకూర్చుకోవాలో తెలియడం లేదు. ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే మనగడ కష్టమే. దీంతో ప్రతిపక్షాలు కూడా గోల చేస్తాయి. దీంతో కాంగ్రెస్ పార్టీకి ఆరు గ్యారెంటీలు పెద్ద ఇబ్బందిగా మారాయి.