భారత్ సమాచార్, రాజకీయం: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో నేడు భాగ్యనగరంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎమ్మెల్సీ కవితకు ఆమె ఇంట్లో ఈడీ అధికాీరులు అరెస్ట్ నోటీసులు అందించారు. సెర్చ్ వారెంట్ తోపాటు అరెస్ట్ వారెంట్ ను ఆమెకు అందజేశారు. ఇంట్లో గంటల తరబడి ఈడీ సోదాలు నిర్వహించింది. అనంతరం ఎమ్మెల్సీని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం కవితను ఈడీ అధికారులు ఢిల్లీకి తరలిస్తున్నారు. రాత్రి 8.55కి ఫ్లైట్ టికెట్స్ బుక్ చేశారు. కవితను తీసుకెళ్లటానికి పోలీసులు రూట్ క్లియర్ చేశారు. కేటీఆర్, హరీష్ రావు కవిత నివాసానికి చేరుకున్నారు.
ఈ కేసులో ఏడాది గ్యాప్ తర్వాత ఎమ్మెల్సీ కవితకు ఫిబ్రవరి నెలలో సీబీఐ నోటీసులు పంపింది. 2022 డిసెంబర్లో కవిత నివాసంలోనే స్టేట్మెంట్ తీసుకున్న సీబీఐ.. గత ఫిబ్రవరి 26న ఢిల్లీకి విచారణకు హాజరవ్వాలంటూ నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో ఆమెను నిందితురాలిగా చేర్చి 41-A కింద నోటీసులు పంపింది సీబీఐ. లిక్కర్ కేసులో కీలక నిందితులు అప్రూవర్లుగా మారడంతో.. వారి స్టేట్మెంట్స్ ఆధారంగా ఎమ్మెల్సీకి నోటీసులు జారీ చేసింది సీబీఐ.
ఈడీ సోదాలపై కవిత లాయర్ సోమా భరత్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకు ఎలాంటి చర్యలు ఉండవన్న ఈడీ.. సోదాలు చేయడం సరికాదని వ్యాఖ్యానించారు.కోర్టులో కేసు ఉండగా అనూహ్యంగా ఎందుకీ సోదాలని ఆయన ప్రశ్నించారు. మరోవైపు బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున కవిత ఇంటికి చేరుకుంటున్నారు. ఈడీ దాడులకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ శ్రేణుల ధర్నాకు దిగారు.
కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కవితను ఈడీ విచారించిన విషయం తెలిసిందే. అప్పుడు ఆమె ఫోన్లు కూడా సీజ్ చేసి రెండు రోజుల పాటు ఏకధాటిగా ఈడీ సుమారు రోజుకు 18 గంటలు విచారించి. చివరికి తీవ్ర ఉత్కంఠ మధ్య విడుదల చేసింది. అయితే ఈ సారి మాత్రం కవితను ఏకంగా అరెస్టుచేసి కస్టడికి తీసుకుంది. కవిత పక్కాగా లిక్కర్ స్కాం చేసినట్లు ఈడీ దగ్గర ఆధారుల ఉన్నట్లు చెప్పింది. అయితే కవితను అరెస్టు చేసే సమయంలో మాజీ మంత్రి, కవిత అన్న కేటీఆర్ అడ్డుకుని ఈడీతో గొడవకు దిగారు. దీంతో కేటీఆర్ పై ఈడీ పలు కేసులు కూడా నమోదు చేసింది.