భారత్ సమాచార్, అమరావతి : తెలుగుదేశం, జనసేన పార్టీల సీట్ల సర్దుబాటు దాదాపుగా ఓ కొలిక్కి వచ్చేసినట్టు తెలుస్తోంది. పొత్తులో భాగంగా జనసేనకు 24 అసెంబ్లీ స్థానాలను పలు దఫాల చర్చల తర్వాత తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు, జనసేన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ ఖరారు చేశారు. మళ్లీ టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సీట్లు, బీజేపీతో పొత్తు, మేనిఫెస్టో రూపకల్పన వంటి విషయాలపై చర్చించటానికి మరోసారి భేటీ అయ్యారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో సుమారు గంటన్నరపాటు వారి మధ్య వాడి వేడిగా చర్చలు సాగినట్టు సమాచారం. ఈ సందర్భంగా జనసేన పార్టీ అభ్యర్థుల తుది జాబితాను తెలుగుదేశం ఆమోదించినట్లు సమాచారం. అయితే వీటిలో 2 సీట్లపై మాత్రం ఇంకా కసరత్తు జరుగుతున్నట్లు చెబుతున్నారు సీనియర్ టీడీపీ నాయకులు. ఉమ్మడి పశ్చిమ గోదావరిలో 6, తూర్పుగోదావరిలో 5, విశాఖపట్నం జిల్లాలో 4, కృష్ణాజిల్లాలో 2, శ్రీకాకుళం, విజయనగరం, గుంటూరు, ప్రకాశం, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లా ల్లో ఒక్కోచోట జనసేన బరిలోకి దిగే అవకాశాలు ఉన్నట్టు మీడియాకు సమాచారం ఉంది.
ఆ రెండు స్థానాలపై తర్జనభర్జన:
ఉమ్మడి విశాఖపట్నం జిల్లా పెందుర్తి నియోజకవర్గం సీటును పొత్తులో భాగంగా జనసేన పార్టీకి కేటాయించారు. ఆ నియోజకవర్గానికి బదులుగా మాడుగుల అసెంబ్లీ స్థానం కేటాయించి, పెందుర్తిని టీడీపీకి తీసుకోవాలని ఆ జిల్లా సీనియర్ టీడీపీ నేతలు కోరుతున్నారు. దీనిపై శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్‌నాయుడు ప్రత్యేకంగా చంద్రబాబును కూడా కలిశారు. దీనిపై కసరత్తు నడుస్తోంది. అలాగే అమలాపురం సీటును జనసేనకు కేటాయించారు. కానీ పి.గన్నవరంలో జనసేనకు మంచి అభ్యర్థి ఉన్నందున దానిని ఆ పార్టీకి ఇచ్చి అమలాపురం సీటు తీసుకోవాలని ఆ జిల్లా టీడీపీ నేతలు అభ్యర్థించారు. దీనిపై కూడా తర్జనభర్జన నడుస్తోంది. ఈ రెండు తప్ప మిగిలిన సీట్లు ఖరారైనట్లేనని రెండు పార్టీల అంతర్గత వర్గాలు తెలిపాయి.