Ashok Gajapathi Raju: గోవా గవర్నర్‌గా అశోక్ గజపతి రాజు ప్రమాణం

భారత్ సమాచార్.నెట్, పనాజీ: ఆంధ్రప్రదేశ్ టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతి రాజు గోవా 20వ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టారు. గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, మంత్రి వర్గ సభ్యుల సమక్షంలో బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే శనివారం ఉదయం 11 గంటల సమయంలో అశోక్ గజపతి రాజుతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతోపాటు ఏపీ మంత్రి నారా లోకేష్, అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు సహా పలువరు టీడీపీ నేతలు హాజరయ్యారు.

 

గోవా గవర్నర్‌గా ప్రమాణం చేసిన ఆయనకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే సీఎం చంద్రబాబు నాయుడు అశోక్ గజపతి రాజుకు శుభాకాంక్షలు తెలుపుతూ.. సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు. ఏ బాధ్యతలు స్వీకరించిన హుందాగా, ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించే అశోక్ గజపతి రాజు.. నేడు గోవా గవర్నర్‌ బాధ్యతలను అంతే అంకితభావంతో నిర్వహిస్తారని పేర్కొంటూ.. ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు చంద్రబాబు నాయుడు.

 

ఇకపోతే ఈ నెల 14న అశోక్‌ గజపతి రాజును గోవా గవర్నర్‌గా నియమిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. టీడీపీలో కీలక నేతగా ఉన్న గజపతి రాజు గతంలో ఏడు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ప్రధాని మోదీ క్యాబినెట్‌లో విమానయానశాఖ మంత్రిగా కూడా విధులు నిర్వహించారు. అంతేకాదు ఎన్టీఆర్, చంద్రబాబు కేబినెట్‌ల్లో కూడా గజపతి రాజు కీలక మంత్రిత్వ శాఖలను నిర్వర్తించారు.

Share This Post