భారత్ సమాచార్, జాతీయం : కేంద్రంలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా.. అదే తీరు. దేశం అభివృద్ధి చెందుతూనే ఉంటుంది. అది నిరంతరం కొనసా..గుతూనే ఉంటుంది. తమకు ఆర్థిక మద్దతుగా నిలిచిన పారిశ్రామికవేత్తల వ్యాపారాలు పెంచడానికి ప్రభుత్వ సంస్థలను నిర్వీర్యం చేస్తూ..వాటిని పతనం చేసేది ఈ ప్రభుత్వ పెద్దలే కదా. ‘‘గతంలో కాంగ్రెస్ కు భిన్నంగా తమ పాలన ఉంటుందని.. తమకు అవినీతి అంటే తెలియదని.. తాము సొక్కంపూసలం..’’ అని బహిరంగ సభల్లో ప్రగాల్భాలు తప్ప.. వేరే ఏమైనా జరిగిందా.. ? దేశం గతి మారిందా?
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. తాము ఏ అవినీతి చేయడం లేదని, ఒక్క కుంభకోణమైనా చూపించండి అని ఆ పాలకులే సవాల్ విసురుతారు. కేంద్ర దర్యాప్తు సంస్థలన్నీ వారి చేతిలోనే ఉన్న తర్వాత ఇక అవినీతి శోధన చేసేదెవరు? ఎవరి అవినీతైనా ఆ ప్రభుత్వం పడిపోయిన తర్వాతే కదా బయటకువచ్చేది. సామాన్య జనాలకు ఓట్ల కోసం ఏవో నాలుగు పథకాలు ప్రకటించి తమకు ఆర్థిక దన్నుగా నిలిచిన కార్పొరేట్ పెద్దలకు తోడి పెట్టడం తప్ప వారు చేసిందేం లేదు.
బీజేపీ ప్రభుత్వంలో లాభపడింది ఎవరైనా ఉన్నారంటే.. ప్రధాని సొంత రాష్ట్ర పారిశ్రామిక పెద్దలు అంబానీ, అదానీలు మాత్రమే అని ప్రతిపక్షాలు, మేధావులు ఆరోపిస్తూనే ఉన్నారు. ముఖేష్ అంబానీకి ఆయిల్స్, టెలికాం, విద్యుత్, ఇన్సూరెన్స్, వ్యవసాయం, మీడిమా సంస్థలు దక్కాయి. ఇప్పుడవే ప్రభుత్వ సంస్థలను మించి పెరిగిపెద్దవై పోయాయి. ఇక అదానీకి బొగ్గుగనులు, ఎయిర్ పోర్టులు రైల్వేలు, వ్యవసాయ భూములు, ప్రభుత్వ రంగ సంస్థలను అప్పగించేశారు. ఇక అదానీ భారత్ తూర్పు, పశ్చిమ తీరాలు మొత్తం రాసిచ్చేశారు. బీజేపీ 2047దాక అధికారంలో ఉండాలనే టార్గెట్ తో ముందుకెళ్తోంది. ఈక్రమంలో దేశంపై గుజరాత్ పారిశ్రామికవేత్తలు, పాలకుల గుత్తాధిపత్యం ఉండాలని వారు భావిస్తున్నారు. మిగతా జనాలను ‘రామజపం’ చేయిస్తూ.. దైవచింతనలోనే ఉంచుతూ తమకు కావాల్సిన కార్యాలను కానిచ్చేసుకుంటున్నారు.
ఇక వీరి పాలనలో సామాన్య జనాలకు మిగిలింది నిరుద్యోగం, అధిక పన్నులు, ద్రవ్యోల్బణం, అవినీతి, ఒత్తిడి, ఉపన్యాసాలు, మతం కోసం పోరాటాలు..తప్ప మరేం మిగలలేదు. ఇవన్నీ పట్టించుకునే వారు లేరు. రాజకీయ నాయకులు అడిగితే ఈడీ దాడులు.. జనాలు అడిగితే ఆందోళన కారులు, మేధావులు అడిగితే దేశద్రోహులు అనే ట్యాగ్ లు తగిలించి జైలులోకి పంపడం తప్పా వేరే లబ్ధి ఏదైనా జరిగిందా? ఇకనైనా పాలకులు మారుతారో.. జనాలకు తిండి, ఉపాధి, ఉద్యోగం, రక్షణ కల్పిస్తారేమో చూడాలి.