భారత్ సమాచార్.నెట్, రంగారెడ్డి: చిలుకూరు ఆలయ పూజారి రంగారాజన్ దాడి ఘటనపై రాజకీయ పార్టీల నాయకులు, హిందూ సంఘాల నాయకులు తీవ్రంగా ఖండించారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ చేసి రంగరాజన్ ను పరామర్శించారు. అదేవిధంగా మాజీ మంత్రి కేటీఆర్ రంగరాజన్ ను కలిసి పరామర్శించారు. దీనిపై చిన్న జీయర్ స్వామి స్పందించారు. రామరాజ్యం పేరుతో ఓ రాక్షస మూక నిత్యం దేవుడి సేవలో తరించే పూజారులపై దాడులకు దిగుతోందని మండిపడ్డారు. తాము చెప్పినట్టు వినకపోతే దేనికైనా తెగిస్తామని హెచ్చరికలు చేస్తోందన్నారు.
రామరాజ్య స్థాపన రాజ్యాంగబద్ధంగా జరగాలని, హింసకు ఎట్టి పరిస్థితుల్లో తావు లేదని చిన్నజీయర్ స్వామి పేర్కొన్నారు. రంగరాజన్‌పై జరిగిన దాడి యోగ్యమైన కాదన్నారు. ప్రస్తుతం సమాజంలో దేవాలయాల అర్చకుల పరిస్థితి బాగా లేదని, వారి ఆర్ధిక పరిస్థితి విద్యా అవకాశాలు లేకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయని అన్నారు. తీవ్రవాదంతో, ఉగ్రవాదంతో సాధించేదేమీలేదన్నారు. కేవలం తాత్కాలిక లాభాలు చేకూరావచ్చు, కానీ అది శాశ్వతం కాదన్నారు. రామరాజ్య స్థాపన రాజ్యాంగబద్ధంగా జరగాలన్నారు. అది ఏ ఒక్కరితో సాధ్యం కాదు. సమాజంలోని ప్రజలందరూ అనుకుంటేనే రామరాజ్య స్థాపన జరుగుతుందన్నారు. దాడికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని వెంటనే వీహెచ్‌పీ జాతీయ అధికార ప్రతినిధి రావినూతల శశిధర్ డిమాండ్ చేశారు. ఈ ఘటనకు పాల్పడ్డ సంఘవిద్రోహ శక్తులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిని అనపర్తికి చెందిన వీరరాఘవరెడ్డిగా పోలీసులు గుర్తించారు.
అస్సలేం జరిగిందంటే..?
ఫిబ్రవరి 7వ తేదీన తన అనుచరులతో కలిసి చిలుకూరులోని రంగరాజన్ నివాసానికి వెళ్లాడు. వీరరాఘవరెడ్డి. తెలుగు రాష్ట్రాల్లో రామరాజ్య స్థాపనకు సైన్యాన్ని తయారు చేస్తున్నారని పోలీసులు తెలిపారు. చిలుకూరు ఆలయానికి వచ్చే భక్తులను తన సైన్యంలో చేర్పించాలని డిమాండ్ చేశారు. వీరరాఘవరెడ్డి ప్రతిపాదనకు ఒప్పుకోని అర్చకుడు రంగరాజన్..తానెందుకు అలా చేస్తానని ప్రశ్నించారు. అలాంటి చర్యలు సమాజానికి ప్రమాదకరమని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. దీంతో తాను చెప్పినట్టు వినాలంటూ రంగరాజన్‌పై దాడి చేశాడు. వీరరాఘవ రెడ్డి. రంగరాజన్‌పై దాడి తర్వాత బెదిరిస్తూ వీడియో రికార్డ్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.