Homebreaking updates newsమటన్ ముసుగులో కుక్కమాంసం

మటన్ ముసుగులో కుక్కమాంసం

భారత్ సమాచార్.నెట్, కర్నాటక: కర్నాటక రాజధాని బెంగళూరులో కుక్క మాంసం రవాణా చేస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో బెంగళూరులోని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ డిపార్ట్‌మెంట్ సమగ్ర దర్యాప్తు ప్రారంభించింది. కేఎస్‌ఆర్‌ రైల్వే స్టేషన్‌కి రాజస్థాన్‌ నుంచి రైలులో వచ్చిన మాంసం కుక్కమాంసంగా కొందరు ఆరోపించడంతో వివాదం చెలరేగింది. 12 సంవత్సరాలుగా బెంగళూరులో మాంసం వ్యాపారం చేస్తున్న ఓ వ్యాపారి.. మటన్‌ ముసుగులో కుక్క మాంసం విక్రయిస్తున్నట్లు హిందూత్వ గ్రూపులు విమర్శలు చేశాయి. రాజస్థాన్‌ రాజధాని జైపూర్ నుంచి జైపూర్-మైసూర్ ఎక్స్‌ప్రెస్ ద్వారా కుక్క మాంసం రవాణా చేస్తున్నట్లు ఆరోపించారు. ఈ గందరగోళం నేపథ్యంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మాంసం నమూనాలను సేకరించి, పరీక్ష కోసం ల్యాబ్‌కు పంపారు.

అది కుక్క మాంసమా, గొర్రె మాంసమా:
దీనిపై ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ డిపార్ట్‌మెంట్ కమిషనర్ మాట్లాడుతూ.. రాజస్థాన్ నుంచి రైలు ద్వారా వచ్చిన పార్శిళ్లను స్టేషన్ వెలుపలి ప్రాంగణంలో రవాణా వాహనంలో లోడ్ చేస్తున్నారు. వీటిని తనిఖీ చేయగా 90బాక్సులు కనిపించాయి. అందులో జంతువుల మాంసం కనిపించింది. అయితే జంతువుల చర్మం తొలగించి ఉండటంతో అది మేక, గొర్రె మాంసమో లేదా కుక్క మాంసమో తెలియరాలేదు. దీనిని నిర్ధారించేందుకు నమూనాలను సేకరించి ల్యాబ్‌కు పంపించాం. ఇతర జంతువుల మాంసాలను కలిపినట్లు నిర్ధారణ అయితే కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ హెచ్చరించారు. రైలులో పార్సిల్‌ ద్వారా రవాణా అయిన మాంసం మటన్‌ అని ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యాపారి తెలిపాడు. తాను గత 12ఏళ్లుగా ఈ వ్యాపారం చేస్తున్నానని, తనపై నిరాధారమైన ఆరోపణలు చేయడం సరికాదని ఆయన అన్నారు. మరోవైపు మాంసం పార్సిల్స్‌ వ్యవహారంపై బెంగళూరు నగరంలో తీవ్ర ఆందోళన నెలకొంది. అయితే ఫుడ్ సేఫ్టీ అధికారులు అసలు ఏ జంతువు మాంసాన్ని రవాణా చేస్తున్నారో అన్నది గుర్తించేందుకు శాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపామని, రిపోర్టు వచ్చిన తర్వాత అసలు విషయం తెలుస్తుందని పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments