Homebreaking updates newsBetting Apps Case బెట్టింగ్‌ కేసు.. బిగుస్తున్న ఉచ్చు...!

Betting Apps Case బెట్టింగ్‌ కేసు.. బిగుస్తున్న ఉచ్చు…!

హైదరాబాద్, భారత్ సమాచార్.నెట్: సంచలనం సృష్టించిన నిషేధిత బెట్టింగ్, జూదం యాప్‌ల కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. ఇప్పటికే ఫణీంద్ర శర్మ అనే వ్యక్తి మియాపూర్‌ పోలీస్‌ స్టేషన్లో కేసు చేయడంతో బెట్టింగ్ యాప్స్ ప్రొమోట్ చేసిన ప్రముఖ సినీ నటుల చుట్టూ ఉచ్చు బిగుసుకుంది. ఆ లిస్ట్ చూస్తే కాస్త పెద్దది గానే ఉంది. ఎందుకంటే టాలీవుడ్‌లో ప్రముఖ హీరోల నుంచి సీనియర్‌ క్యారెక్టర్‌ ఆర్టిస్టుల వరకు అందరూ బెట్టింగ్‌ యాప్‌లకు ప్రచారకర్తలుగా ఉన్నారు.

దగ్గుబాటి రానా, విజయ్ దేవరకొండ, ప్రకాష్‌రాజ్, మంచు లక్ష్మీతో సహా మొత్తం 25 మంది నటులు, ఇన్‌ఫ్లూయెన్సర్లు ఈ కేసులో చిక్కుకున్నారు. అయితే ఎంక్వైరీ ఇంకా మొదలుకాలేదు. మరోవైపు పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లోనూ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ వ్యవహారంలో బుల్లితెర నటులు, యాంకర్లు హర్షసాయి, విష్ణుప్రియ, లోకల్ బాయ్ నాని ఇలా 11మందిపై కేసు నమోదైంది. సెలబ్రెటీలపై నమోదవుతున్న వరుస కేసుల నేపథ్యంలో తాజాగా మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.

25మంది సినీ ప్రముఖులపై కేసు నమోదు:
బెట్టింగ్‌, గ్యాంబ్లింగ్ యాప్‌లను ప్రచారం చేసినందుకు ప్రముఖ నటులు రానా దగ్గుబాటి, ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ, ప్రముఖ నటీనటులు మంచు లక్ష్మి, ప్రణీత, నిధి అగర్వాల్, అనన్య, హనుమంతు, శ్రీముఖి, మరికొందరిపై సైబరాబాద్ పరిధిలోని మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఫణీంద్ర శర్మ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మొత్తం 25 మంది సినీ ప్రముఖులు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్స్‌పై కేసు నమోదు చేశారు.

నిందితుల జాబితాలో ఉన్నది వీరే: రానా దగ్గుబాటి, ప్రకాష్ రాజ్, విజయ్‌ దేవరకొండ, మంచు లక్ష్మి, ప్రణీత, నిధి అగర్వాల్‌, అనన్య నాగళ్ల, సిరి హనుమంతు, శ్రీముఖి, వర్షిణి సౌందరరాజన్‌, వసంతి కృష్ణన్‌, శోభా శెట్టి, అమృత చౌదరి, నయని పావని, నేహా పఠాన్‌, పండు, పద్మావతి, ఇమ్రాన్‌ ఖాన్‌, విష్ణు ప్రియ, హర్ష సాయి, బయ్యా సన్నీ యాదవ్‌, యాంకర్‌ శ్యామల, టేస్టీ తేజ, రీతూ చౌదరి, బండారు సుప్రీతల పేర్లు ఉన్నాయి.

19యాప్‌ల నిర్వహకులను విచారణకు ఆదేశం:
వీటన్నింటికీ మూల కారణం యాప్‌లే కాబట్టి వాటి నిర్వాహకుల్ని కూడా నిందితులుగా చేర్చి విచారణకు పిలవాలనే నిర్ణయానికి వచ్చారు. దీంతో ఈ కేసులో బెట్టింగ్‌ యాప్‌ల నిర్వాహకుల్ని కూడా నిందితులుగా చేర్చుతూ మియాపూర్‌ పోలీసులు చర్యలు చేపట్టారు.

మొత్తం యాప్‌లు ఇవే: మొత్తం 19 యాప్‌ల పేర్లను నిందితుల జాబితాలో జతచేశారు. జంగ్లీ రమ్మీ డాట్‌కామ్, ఏ23, యోలో247డాట్‌కామ్, ఫెయిర్‌ప్లే, జీత్‌విన్, వీఎల్‌బుక్, తాజ్‌77, వీవీబీబాక్, ధని బుక్‌365, మామ247, తెలుగు365, యెస్‌365, జై365, వీవీబుక్, ఓకేవిన్, జెట్‌ఎక్స్, పరిమ్యాచ్, తాజ్‌777బుక్, ఆంధ్రా365 తదితర యాప్‌ల పేర్లను ఇందులో చేర్చారు. అలాగే బెట్టింగ్‌ యాప్‌లకు ప్రచారకర్తలుగా నటించిన పలువురు నటులు, ఇన్‌ఫ్లూయెన్సర్లకు నోటీసులిచ్చి విచారించే ముందు పోలీసులు న్యాయసలహా తీసుకున్నారు. మొదట బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులు, మీడియేటర్లను విచారించిన ఆ తర్వాత సెలబ్రిటీలను విచారణకు పిలవనున్నట్లు సమాచారం.

నిషేధం ఉన్నప్పటికీ బెట్టింగ్‌లోకి దించారు:
తెలంగాణలో బెట్టింగ్‌లపై నిషేధం ఉన్న సంగతి తెలిసిందే. ప్రచార కర్తల మాటలు నమ్మి దాదాపు 980 మంది యాప్‌ ద్వారా మోసపోయి ప్రాణాలు తీసుకున్నారు. దీంతో ప్రభుత్వం వీటిని నిషేధించింది. అయితే బెట్టింగ్‌ నిర్వాహకులు మాత్రం వేర్వేరు పేర్లతో ఎప్పటికప్పుడు రంగులు మార్చుతూ బెట్టింగ్‌ యాప్‌లను విస్తృతంగా అందుబాటులోకి తీసుకొస్తున్నారు. దీనిపై సీరియస్‌ అయిన తెలంగాణ రాష్ట్రప్రభుత్వం యాప్ నిర్వహకులపై కొరడా జులిపించింది.

మరిన్ని కథనాలు:

బెట్టింగ్ యాప్ ప్రచారం.. బాలకృష్ణ, ప్రభాస్, గోపీచంద్‌లపై కేసు నమోదు

RELATED ARTICLES

Most Popular

Recent Comments