భారత్ సమాచార్, రాజకీయం : నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇటీవల సీఎం రేవంత్ రెడ్డితో భేటీ కావడం ఆ పార్టీలో ప్రకంపనలు మొదలయ్యాయి. ఎంతగా అంటే.. ఆ నలుగురు ఎమ్మెల్యేలతో అదేపనిగా ప్రెస్ మీట్లు పెట్టించి.. తాము పార్టీ మారడం లేదని గట్టిగా చెప్పించారు. అయితే లోలోపల మాత్రం బీఆర్ఎస్ షేకైపోతోంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎక్కువ సీట్లు గెలుచుకుంది. ఆందోల్, మెదక్ తప్ప అన్ని సెగ్మెంట్లను బీఆర్ఎస్సే విజయం సాధించింది.
ఆ జిల్లా పూర్తిగా హరీశ్ రావు ఆధీనంలో ఉంటుంది. అలాంటి జిల్లాలో ఎవరికీ తెలియకుండా నలుగురు ఎమ్మెల్యేలు వెళ్లి సీఎంతో భేటీ కావడం అనేది జరిగే పని కాదు. పార్టీలో ముఖ్యనేతలతో ఎంతో కొంత సమాచారం ఉండే ఉంటుంది. హరీశ్ రావుకు పూర్తిగా తెలుసని.. ఆయనకు తెలియకుండా భేటీ జరిగే అవకాశం లేదని చెబుతున్నారు. ఇది కూడా బీఆర్ఎస్ లో అలజడి రేగడానికి మరో కారణంగా మారింది. పైగా నలుగురిలో సునీతాలక్ష్మారెడ్డి సుదీర్ఘ కాలం కాంగ్రెస్ తో అనుబంధం ఉన్న నేత. ఇక పటాన్ చెరు ఎమ్మెల్యేకు పవర్ లేకపోతే పూట గడవదు.
తెలంగాణలో బాగా ఆదాయం వచ్చే నియోజకవర్గాల్లో ఇది ఒకటి. ఇప్పుడు అక్కడ కాంగ్రెస్ ఇన్ చార్జిదే రాజ్యం. మిగతా వారిదీ అదే పరిస్థితి. అందుకే వారు రేవంత్ రెడ్డిని కలిశారు. కానీ కాంగ్రెస్ తో చర్చలు జరుపలేదు. చేరాలా లేదా.. చేరితే ఏమొస్తుందన్న చర్చలు జరగలేదు. కానీ ఒక్క భేటీ మాత్రం జరిగింది. దీంతో ఆ ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ లో అపనమ్మకం బయలుదేరింది. రేవంత్ తల్చుకుంటే బీఆర్ఎస్ ను ఊడ్చేస్తారన్న ప్రచారమూ ఊపందుకుంది.
ప్రభుత్వ మనుగడపై బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ప్రకటనలన్నీ ఒక్క దెబ్బకు తేలిపోయేలా రేవంత్ రెడ్డి చేశారని టాక్ వినపడుతోంది. ఈ ఊపు కొనసాగిస్తే లోక్ సభ ఎన్నికల సమయానికి బీఆర్ఎస్ ఉక్కిరిబిక్కిరి కావడం ఖాయం. ఇక నుంచి బీఆర్ఎస్ అధిష్ఠానానికి తమ ఎమ్మెల్యేను ట్రాకింగ్ చేయడమే ప్రధానమైన పని కానుంది.