భారత్ సమాచార్.నెట్, హైదరాబాద్: మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి (Jagadish Reddy)ని తెలంగాణ అసెంబ్లీ (Telangana Assembly) నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ (Speaker Gaddam Prasad Kumar) ప్రకటించారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు ఈ సస్పెన్షన్ (Suspended) అమల్లో ఉండనుంది. బడ్జెట్ సెషన్స్ ముగిసే వరకు జగదీశ్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు వేయాలని సభావ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు ప్రతిపాదించగా.. స్పీకర్ ఆమోదించారు.
ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి సస్పెన్షన్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు (BRS MLA’s) భగ్గుమన్నారు. సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని సభలో ఆందోళనకు దిగారు. తమకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ఛాంబర్‌లో కూర్చొన్న జగదీశ్ రెడ్డి వద్దకు చీఫ్ మార్షల్స్ వచ్చి అసెంబ్లీ నుంచి వెళ్లిపోవాలని సూచించారు. సభ నుంచి మాత్రమే సస్పెండ్ చేశారని.. ప్రతిపక్ష నేత ఛాంబర్‌లో కూర్చుంటే అభ్యంతరమేంటని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్, హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ వాగ్వాదానికి దిగారు.
అసలు ఏం జరిగిందంటే?
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మార్చి 12న ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. అయితే గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలోనే జగదీశ్ రెడ్డి స్పీకర్‌ను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సభ అందరిదీ.. సభ మీ ఒక్కరిది కాదంటూ జగదీష్ రెడ్డి వ్యాఖ్యానించారు. సభా రూల్స్‌కు వ్యతిరేకంగా జగదీశ్ రెడ్డి మాట్లాడారని స్పీకర్‌తో సహా కాంగ్రెస్ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. జగదీశ్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ నేపథ్యంలో స్పీకర్‌తో శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు సమావేశమయ్యారు. జగదీశ్ రెడ్డి మాట్లాడిన వీడియోను పరిశీలించారు. అనంతరం జగదీశ్ రెడ్డిని బడ్జెట్ సమావేశాలు మొత్తం సస్పెండ్ చేస్తూ శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు సభలో తీర్మానం ప్రవేశపెట్టారు. తీర్మానానికి ఆమోదం లభించడంతో జగదీశ్ రెడ్డిని బడ్జెట్ సమావేశాలు మొత్తం సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.
నిరసనలకు బీఆర్ఎస్ పిలుపు..
మరోవైపు జగదీశ్ రెడ్డిని ఉద్దేశపూర్వకంగా సభ నుంచి సస్పెండ్ చేశారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్ పట్ల ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని.. తాను చేసిన తప్పేంటని వివరణ అడిగే అవకాశం కూడా జగదీశ్ రెడ్డికి ఇవ్వలేదన్నారు. తప్పు చేయకపోయినా స్పీకర్‌పై గౌరవంతో విచారం వ్యక్తం చేస్తామని చెప్పామని.. తన వాదనను కూడా వినిపించుకోలేదన్నారు. తప్పు మాట్లాడి ఉంటే ఆ వీడియోలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఇక ఇదే విషయమై రేపు రాష్ట్రవ్యాప్తంగా నిరసనల (Protest)కు పిలుపునిచ్చింది బీఆర్ఎస్. ప్రభుత్వ దిష్టిబొమ్మల దహనానికి కేటీఆర్ పిలుపునిచ్చారు.