భారత్ సమాచార్.నెట్, న్యూఢిల్లీ: యూపీఐ పేమెంట్స్ (UPI Payments)పై జీఎస్టీ (GST) విధించబోతున్నారంటూ వచ్చిన వార్తలపై కేంద్రం (Central Govt) క్లారిటీ ఇచ్చింది. యూపీఐ చెల్లింపులపై జీఎస్టీ విధించనున్నారనే ప్రచారాన్ని కేంద్రం ఖండించింది. దేశంలో ఇకనుంచి రూ.2 వేలకు పైగా చేసే అన్ని రకాల యూపీఐ పేమెంట్స్‌పై 18% జీఎస్టీ విధించేందుకు కేంద్రం సిద్ధమవుతోందంటూ వచ్చిన వార్తలను కేంద్రం తోసిపుచ్చింది. ఈ మేరకు కేంద్ర ఆర్థికమంత్రిత్వ శాఖ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది.
యూపీఐ పేమెంట్స్‌పై జీఎస్టీ అంటూ ఈరోజు కొన్ని జాతీయ మీడియా సంస్థలు, సోషల్ మీడియా, వెబ్‌సైట్లు కథనాలను ప్రసారం చేయడంతో కేంద్రం స్పందించింది. అవన్నీ అవాస్తవాలని, నిరాధార ఆరోపణలు అని కొట్టి పారేసింది. ప్రస్తుతానికి అలాంటి ఆలోచనలు ఏవీ లేవని, చిన్న చిన్న చెల్లింపులపై ఎటువంటి టాక్స్‌లు విధించబోమని ఆర్థికశాఖ స్పష్టం చేసింది. యూపీఐ ద్వారా డిజిటల్ చెల్లింపులను మరింత ప్రమోట్ చేయడమే తమ ముఖ్య ఉద్దేశమని పేర్కొంది.
ఇదిలా ఉంటే దేశంలో నేడు యూపీఐ పేమెంట్స్ సర్వ సాధారణం అయ్యాయి. నగరం నుంచి మారుమూల పల్లెల వరకు ఈ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ వ్యాప్తి చెందింది. దీంతో ఆన్‌లైన్ చెల్లింపులు భారీగా పెరగడంతో.. జనాలు జేబులో డబ్బులు ఉంచుకోవడం లేదు. కిరణా షాపు నుంచి కూరగాయల షాపు వరకు క్యూఆర్ కోడ్ స్కానర్‌లు ఉంటున్నాయి. జేబులో డబ్బులు లేకున్నా.. స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు ఎక్కడికైనా వెళ్లి రావచ్చు అనే ఆలోచనలో జనాలు ఉన్నారు.