భారత్ సమాచార్.నెట్: కాంగ్రెస్ సీనియర్ (Congress Senior Leader) నేత పి.చిదంబరం (P.Chidambaram) భారతీయ జనతా పార్టీ (BJP)పై ప్రశంసలు కురిపించారు. అదే సమయంలో విపక్ష ‘ఇండియా కూటమి’ (Indian Alliance) భవిష్యత్తుపై సందేహాలు వ్యక్తం చేశారు. కూటమిలో నెలకొన్న అస్పష్టత వాస్తవమేనని ఆయన అంగీకరించారు. సల్మాన్ ఖుర్షీద్ మరియు మృతుంజయ్ సింగ్ యాదవ్ రాసిన ‘కాంటెస్టింగ్ డెమోక్రటి డెఫిసిట్’ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా చిదంబరం మాట్లాడుతూ.. ఇండియా కూటమికి భవిష్యత్ లేదని.. అది చాలా బలహీనంగా ఉందన్నారు. అయితే తిరిగి బలపడేందుకు ఇప్పటికీ సమయం ఉంది కానీ.. వచ్చే లోక్‌సభ ఎన్నికల నాటికి ఇండియా కూటమి పంజుకుంటుందనే నమ్మకం లేదన్నారు. ఇక బీజేపీ విషయానికొస్తే.. ఆ పార్టీ చాలా శక్తివంతంగా, వ్యవస్థీకృతంగా పనిచేస్తోందన్నారు. అన్ని రంగాల్లోను అంతగా పటిష్టంగా పనిచేసే మరో పార్టీ ప్రస్తుతం లేదని.. బీజేపీకి ప్రతి వ్యవస్థపై పట్టు ఉందన్నారు. వాటిని తన నియంత్రణలోకి తీసుకునే సామర్థ్యం ఆ పార్టీకి ఉందని చెప్పారు.
అలాంటి పరిస్థితుల్లో విపక్ష కూటమి బలపడాలంటే.. అన్ని విభాగాల్లోనూ తనను తాను మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా ఇండియా కూటమిలో సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇండియా కూటమిలో అంతర్గత సమస్యలు ఉన్నాయని ఆయన చేసిన వ్యాఖ్యలు జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. అయితే చిదంబరం వ్యాఖ్యలపై బీజేపీ నేతలు కౌంటరిస్తూ ఇండియా కూటమి భవిష్యత్‌పై అందులో ఉన్న నాయకులకే నమ్మకం లేదని విమర్శలు గుప్పిస్తున్నాయి.