భారత్ సమాచార్, అమరావతి ;
అసెంబ్లీ ఎన్నికల్లో సూపర్ సిక్స్ హామీలను ప్రకటించి అధికారం దక్కించుకున్న కూటమి ప్రభుత్వం వాటిని అమలు చేయటంలో ఘోరంగా విఫలమవుతోందని మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి విమర్శించారు. తాజాగా ఏపీ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ముఖ్యమంత్రి ప్రజలను మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రజలకు ఎన్నికల మెనిఫెస్టోలో పెట్టి బడ్జెట్ కేటాయించని వాటి గురించి ప్రత్యేకంగా ఇలా ప్రస్తావించారు.
‘‘ ప్రజలకు సూపర్‌సిక్స్ పేరుతో హామీలు ఇచ్చి బడ్జెట్లో ఎగ్గొట్టావు.
నీవు చీటర్‌వి కాదా? నువ్వు చేసింది మోసం కాదా?
ఆడబిడ్డ నిధి:
18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1500ల చొప్పున ఏడాదికి రూ.18వేలు. 2.07 కోట్ల మంది మహిళలకు రూ.37,313 కోట్లు ఇవ్వాలి. ఎంత ఇచ్చావ్?
దీపం:
ప్రతి కుటుంబానికి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు. 1,54,47,061 కనెక్షన్లకు గాను రూ.4115 కోట్లు ఇవ్వాలి. ఎన్ని కోట్లు కేటాయించావ్?
తల్లికి వందనం:
ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికీ ఏడాదికి రూ.15,000 లు ఇస్తా అన్నావు. రాష్ట్రంలో 83 లక్షల మంది పిల్లలకు గాను రూ.12,450 కోట్లు ఇవ్వాలి. ఎంత మందికి ఇచ్చావ్?
అన్నదాత:
ప్రతి రైతుకు ఏడాదికి రూ.20వేల చొప్పున ఆర్థిక సాయం అన్నావు. రాష్ట్రంలో 53.52 లక్షల మంది రైతులకు గాను రూ.10,706 కోట్లు అవుతుంది. ఎంత ఇచ్చావ్?
ఉచిత బస్సు ప్రయాణం:
రాష్ట్రంలో మహిళల ఉచిత బస్సు ప్రయాణానికి దాదాపు ఏడాదికి రూ.3వేల కోట్లు అవుతుంది. ఇప్పటి వరకు అతీగతీలేదు.
యువగళం:
రాష్ట్రంలో 20 లక్షల మంది యువతకు ఉపాధి, నిరుద్యోగులకు రూ.3వేలు ఇస్తా అన్నావ్. ఒక్కొక్కరికి ఏడాదికి రూ.36వేల చొప్పున రూ.7,200 కోట్లు ఇవ్వాలి? ఎప్పుడు ఇస్తావ్
50 ఏళ్లు పైబడిన వారికి రూ.4వేలు పింఛన్:
రాష్ట్రంలో 50 ఏళ్లు పైబడిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారు దాదాపు 17 లక్షల మంది ఉన్నారు. ఒక్కొక్కరికి రూ.4వేల చొప్పున ఏడాదికి రూ.48వేలు ఇస్తా అన్నావ్. మొత్తం రూ.8,160 కోట్లు కావాలి. నువ్వు ఎంత ఇచ్చావ్.
నీపై 420 కేసు ఎందుకు పెట్టకూడదు?
ప్రశ్నిస్తే కేసులు పెడతానంటున్నావు, అరెస్టులు చేస్తానంటున్నావు. నాతో సహా మా పార్టీ నాయకులు, కార్యకర్తలు, సోషల్‌మీడియా యాక్టివిస్టులు నిన్ను నిలదీస్తూ కచ్చితంగా పోస్టులు పెడతారు.’’