భారత్ సమాచార్.నెట్, తిరుమల: దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల రాజధానుల్లో శ్రీవారి ఆలయం (Srivari temples) నిర్మిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandra Babu Naidu) స్పష్టం చేశారు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ముందుకొస్తే ఆలయ నిర్మాణాలు చేపడతామన్నారు. మనవడు దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యులతో తిరుమల (Tirumala) శ్రీవారిని సీఎం చంద్రబాబు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. ప్రపంచ వ్యాప్తంగా హిందువులు ఎక్కువగా ఉన్న చోట్ల ఆలయాలు నిర్మిస్తామని.. అందుకోసం ఆలయ ట్రస్ట్ ఏర్పాటు చేస్తామన్నారు.
అదేవిధంగా తిరుమల వెంకటేశ్వరస్వామి ఆస్తులను కాపాడటమే తమ లక్ష్యమని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. తిరుమల ఏడు కొండలు శ్రీవేంకటేశ్వరస్వామి సొంతమన్నారు. శేషాచల కొండల సమీపంలోనూ ఇతర వ్యాపారాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. అలిపిరి వద్ద ముంతాజ్ హోటల్ నిర్మాణానికి వైసీపీ ప్రభుత్వం కేటాయించిన 20 ఎకరాల లీజును రద్దు చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. 35 ఎకరాల లీజులను ఇలాంటివి రద్దు చేసినట్లు గుర్తుచేశారు. శ్రీవారి ఆలయంలో హిందువులు మాత్రమే పనిచేయాలన్నారు. టీటీడీలో అన్యమత ఉద్యోగులను వేరే శాఖలకు బదిలీ చేయడానికి ఆదేశాలు ఇచ్చినట్లు చెప్పారు. ఇతర మతస్థులు ఉంటే ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా చూస్తామన్నారు.
ఇకపోతే శ్రీవారి దర్శించుకున్న అనంతరం సీఎం చంద్రబాబు నాయుడు వెంగమాంబ అన్న వితరణ కేంద్రంలో భక్తులకు అన్న ప్రసాదాలు స్వయంగా వడ్డించారు. కుటుంబ సభ్యులతో కలసి అక్కడే భోజనం చేశారు. అనంతరం తిరుమల వెంకన్న భక్తులకు టీటీడీ అందజేసే అన్నప్రసాద వితరణకు సీఎం కుటుంబం ఒకరోజు అయ్యే ఖర్చును విరాళంగా అందజేసింది నారా కుటుంబం. మనవడు దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా రూ. 44 లక్షలను చంద్రబాబు నాయుడు అన్నప్రసాదం ట్రస్ట్‌కు విరాళంగా ఇచ్చారు.