భారత్ సమాాచార్.నెట్, హైదరాబాద్: తెలంగాణ(Telangana) రాజకీయాల్లో కీలక నేతల భద్రత ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. బీజేపీ నాయకురాలు, మహబూబ్‌నగర్(Mahabubnagar) ఎంపీ డీకే అరుణ(MP DK Aruna) ఇంట్లో ఆదివారం గుర్తుతెలియని వ్యక్తి చొరబడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ ఘటన రాష్ర్ట వ్యాప్తంగా సంచలనంగా మారింది. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. మరోవైపు విషయం తెలిసిన వెంటనే సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ క్రమంలో డీకే అరుణకు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఫోన్ చేసి వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఘటన జరిగిన తీరు, తన అనుమానాలను సీఎం రేవంత్ దృష్టికి తీసుకెళ్లారు డీకే అరుణ. ఈ క్రమంలోనే భద్రత పెంచుతామని సీఎం రేవంత్ రెడ్డి డీకే అరుణకు హామీ ఇచ్చారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అలాగే ఈ ఘటనపై విచారణ చేపట్టాలని.. ఎంపీ డీకే అరుణకు భద్రత పెంచాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా రాజకీయ నేతల భద్రత విషయంలో ఎలాంటి పొరపాట్లు జరగకూడదని, పోలీసులు అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశించారు.
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 56లో ఉన్న డీకే అరుణ ఇంట్లోకి మార్చి 16న గుర్తుతెలియని వ్యక్తి చొరబడ్డాడు. ఆదివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సీసీ కెమెరా వైర్లను కత్తిరించి, దాదాపు గంటన్నర పాటు లోపలే ఉన్న ఆగంతకుడు.. ఏమీ దొంగిలించకుండా వెళ్లిపోయాడు. ఈ ఘటనపై ఎంపీ డీకే అరుణ డ్రైవర్ లక్ష్మణ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీంతో పోలీసులు విచారణ చేపట్టారు. చేతులకు గ్లోవ్స్, ముఖానికి మాస్క్ ధరించిన ఆగంతకుడు ఇంటి వెనుక భాగంలోని కాంపౌండ్ గోడను దూకి, గ్రౌండ్ ఫ్లోర్లోని కిటికీ అద్దాన్ని తొలగించి లోపలికి ప్రవేశించాడని పోలీసులు తెలిపారు. అప్పుడు డీకే అరుణ ఇంట్లో లేరు. ఆ సమయంలో అరుణ కుమార్తె, మనవరాలు మొదటి అంతస్తులోని వేర్వేరు గదుల్లో నిద్రపోతున్నారు. ఈ క్రమంలోనే డీకే అరుణ భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. తాను ఇంట్లో ఉన్నప్పుడు ఇంటి దగ్గర సెక్యూరిటీ ఉంటుందని.. తన కుటుంబం సెక్యూరిటీ గురించి చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్‌ను కోరారు. తాజాగా దీనిపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి డీకే అరుణకు భద్రత పెంచాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు.