భారత్ సమాచార్.నెట్: సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచి ఫార్మా కంపెనీలో పేలుడు ఘటనపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పేలుడు ఘటనపై విచారణ జరిపేందుకు రేవంత్ సర్కార్ నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ చైర్మన్‌గా బి. వెంకటేశ్వర్, సభ్యులుగా ప్రతాప్ కుమార్, సూర్యనారాయణ, సంతోష్‌ను నియమించింది. ప్రమాదానికి గల కారణాలను గుర్తించిన నెలరోజుల్లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.
అలాగే ప్రమాదానికి గల కారణాలతో పాటు ఫ్యాక్టరీలో సేఫ్టీ నిబంధనలు పాటించారా అనే అంశాలను కూడా ఈ కమిటీ దర్యాప్తు చేయనుంది. కాగా నిపుణల కమిటీ ప్రమాదంపై విచారణ చేయనుంది. ప్రమాదానికి కారణం ఏంటీ? ప్రభుత్వ నిబంధనలు కంపెనీ పాటిస్తుందా అనే అంశాలపై వివరాలు రాబట్టి.. ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. ఇక ఈ కమిటీకి డైరెక్టరేట్ ఆఫ్ ఫ్యాక్టరీస్ సహకారం అందించాలని ఆదేశించింది.
ఇదిలా ఉంటే పాశమైలారం సిగాచి ఫార్మా కంపెనీలో రెండు రోజుల క్రితం ఘోర ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ప్రమాదంలో 40 మంది వరకు చనిపోయినట్టు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. అలాగే 33 మంది వరకు గాయపడినట్టు తెలిపింది. ఘటనా స్థలంలో ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల కుటుంబాలకు రూ. కోటి చొప్పున పరిహారం ఇస్తామని కంపెనీ సెక్రటరీ వివేక్ కుమార్ స్పష్టం చేశారు. అలాగే గాయపడిన కార్మికులకు పూర్తి వైద్యసాయం అందిస్తామని చెప్పారు.