భారత్ సమాచార్, అంతర్జాతీయం ;
21వ శతాబ్దంలో ఒక కంటికి కనిపించని వైరస్ మానవాళి జీవితంపై ఇంతలా ప్రభావం చూపిస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. కొవిడ్ -19 ఎఫెక్ట్ మానవ నాగరికతపై, జీవర సరళి పై ఇంకో శతాబ్దం ప్రభావం చూపేలా ఉంది. ఇప్పటికే చాలా మంది అనూహ్యంగా ఉన్నట్టుండి గుండె పోటుకు గురవుతున్నారు. వారిలో యువత కూడా ఎక్కువగా ఉన్నారు. వీటన్నిటికి పోస్ట్ కొవిడ్ ఎఫెక్ట్ కారణమని కొందరి వాదన. తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) మానవాళి జీవిత ఆయుర్దాయం పై సంచలన నివేదిక విడుదల చేసింది.
ఈ నివేదిక ప్రకారం పదేళ్లుగా పెరుగుతూ వస్తున్న మనిషి ఆయుర్దాయం కరోనా వల్ల ఒక్కసారిగా పడిపోయిందని అందులో పేర్కొంది. దాదాపుగా ఒకటిన్నర సంవత్సరాలు మనిషి లైఫ్ స్పాన్ పడిపోయింది. భారత దేశంలో పదేళ్లుగా పెరుగుతూ వస్తున్న ఆయుర్దాయం కొవిడ్ కారణంగా ఒక్కసారిగా పడిపోయిందని తెలిపింది. ఇది ఏకంగా 1.8 సంవత్సరాలు తగ్గి 71.4 ఏళ్లకు చేరిందని తెలిపింది. 2012 నివేదిక ప్రకారం భారత్ లో సగటు ఆయుర్దాయం 71 ఏళ్లకు కాస్త అటూఇటూగా ఉండేదని, కరోనా ఎఫెక్ట్ తో మళ్లీ ఇదే పరిస్థితి నెలకొందని డబ్ల్యూహెచ్వో వెల్లడించింది. కరోనా మహమ్మారికి ముందు.. 2019లో భారత్ లో పౌరుల ఆయుర్దాయం 73 ఏళ్లుగా ఉండేదని తెలిపింది. రెండేళ్ల పాటు ప్రపంచాన్ని కుదిపేసిన కరోనా ప్రభావంతో పదేళ్ల పాటు పెరుగుతూ వచ్చిన ఆయుర్దాయం తగ్గుముఖం పట్టిందని చెప్పింది. అలాగే ఆరోగ్యకరమైన జీవితం గడిపే వయసు కూడా 61 ఏళ్లకు పడిపోయిందని వివరించింది.
ఐక్యరాజ్యసమితి ప్రపంచ ఆరోగ్య సంస్థ విడుదల చేసిన వరల్డ్ హెల్త్ స్టాటిస్టిక్స్ తాజా జాబితా ప్రకారం.. అమెరికా, ఈశాన్య ఆసియాలో 2019 నుంచి 2021 మధ్య మనిషి ఆయుర్దాయం దాదాపుగా మూడేళ్లు తగ్గిపోయింది. అదే సమయంలో ఆరోగ్యకరమైన జీవిత కాలం రెండున్నర సంవత్సరాలు తగ్గింది. కరోనా ప్రపంచవ్యాప్తంగా వ్యాపించినప్పటికీ మనిషి ఆయుర్దాయంపై దీని ప్రభావం ఒక్కో దేశంలో ఒక్కోలాగా ఉందని డబ్ల్యూహెచ్ వో సైంటిస్టులు చెప్పారు. పశ్చిమ పసిఫిక్ ప్రాంతంలో ఆయుర్దాయంపై కరోనా ప్రభావం తక్కువగా ఉంది. ఈ ప్రాంతంలో మనిషి ఆయుర్దాయం ఏడాది కన్నా తక్కువగానే పడిపోయిందని, ఆరోగ్యకరమైన జీవన కాలం కూడా రెండేళ్ల కన్నా సైంటిస్టులు తాజాగా వెల్లడించారు.